Read more!

English | Telugu

5 రోజుల్లో 5 పాటలు పూర్తి.. ఇప్పటి డైరెక్టర్లకు ఇది సాధ్యమేనా?

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం, షూటింగ్‌ జరిగే రోజుల సంఖ్య కూడా పెరుగుతోంది. వాస్తవానికి టెక్నాలజీ పెరిగితే బడ్జెట్‌, షూటింగ్‌ టైమ్‌ ఈ రెండు తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం అలా జరగడంలేదు. ఒకప్పుడు ఫిల్మ్‌తో సినిమా చేసేవారు కాబట్టి దాన్ని దుర్వినియోగం చేస్తే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది కాబట్టి ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా తీసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా డిజిటలే కాబట్టి ఎన్ని షాట్స్‌ అయినా తీసుకోవచ్చు అన్న ధీమా పెరిగి జాగ్రత్త తగ్గింది. డిజిటల్‌ వల్ల షాట్‌ క్వాలిటీగా రావచ్చు. కానీ, ఆ సీన్‌లో క్వాలిటీ కనిపించడం లేదు. దాంతో రోజుల తరబడి షూటింగ్‌ చేస్తూనే ఉంటారు. పాటల విషయానికి వస్తే ఒక పాట తియ్యాలంటే నాలుగైదు రోజులు, ఒక్కోసారి వారం రోజుల టైమ్‌ కూడా తీసుకుంటున్నారు. పాత రోజుల్లో పాటలు ఎలా తీసేవారో తెలుసుకుంటే ప్రేక్షకులతోపాటు ఇప్పటి దర్శకులు కూడా ఆశ్చర్యపోక తప్పదు. 

ఎన్‌.టి.రామారావు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1981లో రూపొందిన ‘గజదొంగ’ చిత్రాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చలసాని గోపి, కె.నాగేశ్వరరావు, జి.వెంకటరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ జరిగిన విధానం గురించి నిర్మాతల్లో ఒకరైన కె.నాగేశ్వరరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘రామారావుగారు ఏ నిర్మాతకైనా నెలకి 10 రోజుల చొప్పున 30 రోజులు డేట్స్‌ వచ్చేవారు. ఆ 30 రోజుల్లోనే ఆయనకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలోనే ‘గజదొంగ’ చిత్రానికి కూడా డేట్స్‌ ఇచ్చారు. టాకీ పార్ట్‌ పూర్తయింది. 5 పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉంది. ఆ సమయంలోనే మరో షూటింగ్‌లో రామారావుగారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన చేయి ఫ్యాక్చర్‌ అయింది. 6 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆరు వారాలపాటు షూటింగ్‌ చేయకపోతే నిర్మాతకు ఎంత నష్టం జరుగుతుందో ఆయనకు తెలుసు. పైగా ఆ తర్వాత హీరోయిన్ల డేట్స్‌ కూడా దొరకవు. ఆ ఉద్దేశంతోనే 4 వారాలకే గాయాన్ని కూడా లెక్క చేయకుండా షూటింగ్‌ పెట్టుకోమన్నారు. బ్యాలెన్స్‌ ఉన్న ఐదు పాటల్ని రోజుకొకటి చొప్పున తీస్తేనే అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తవుతుంది, అనుకున్న డేట్‌కి సినిమా రిలీజ్‌ అవుతుంది. ఇదే విషయాన్ని రామారావుగారికి రాఘవేంద్రరావుగారు చెప్పారు. దానికి ఆయన కూడా సరేనన్నారు. అలా మా సినిమాలోని 5 పాటల్ని ఐదు రోజుల్లో చిత్రీకరించడం జరిగింది. ఆ సినిమాలోని పాటలు ఎంత సూపర్‌హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే’ అని వివరించారు. 

దీన్నిబట్టి అప్పట్లో షూటింగ్‌ ఎంత వేగంగా పూర్తి చేసేవారో అర్థమవుతుంది. రోజుకొక పాట చొప్పున ఐదు రోజులపాటు ఐదు పాటల్ని నిర్విరామంగా షూట్‌ చెయ్యడం అనేది మామూలు విషయం కాదు. దీనికి హీరో, హీరోయిన్ల సహకారం ఉండాలి, డైరెక్టర్‌కి ఆ పాటల చిత్రీకరణ పట్ల ఒక విజన్‌ ఉండాలి, టెక్నీషియన్స్‌ అంతా కలిసికట్టుగా పనిచేయాలి. అలా చేశారు కాబట్టే హీరోలు, డైరెక్టర్లు ఒక సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేయగలిగేవారు.