Read more!

English | Telugu

దాస‌రి డైరెక్ష‌న్‌లో టీనేజ్‌లో ర‌మేశ్ లీడ్ రోల్ చేసిన‌ 'నీడ‌'

 

ఎదిగే పిల్ల‌ల‌పై వారు పెరిగే వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు, చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌వారి మ‌న‌స్త‌త్వం, సినిమాలు లాంటివి ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెలియ‌జేసే సినిమా 'నీడ' (1979). ప‌ది రోజుల్లో విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాస‌రి నారాయ‌ణ‌రావు చిత్రీక‌రించిన ప‌ది రీళ్ల సినిమా 'నీడ‌'. ర‌మేశ్‌బాబు 14 ఏళ్ల వ‌య‌సులో తొలిసారిగా మెయిన్‌రోల్ చేసిన సినిమా 'నీడ‌'. ఈ మూవీలో ర‌మేశ్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను మ‌హేశ్‌బాబు చేయ‌డం విశేషం. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌ను ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి పోషించారు. ర‌మేశ్‌కు 'నీడ' మంచి పేరు తెచ్చింది.

1979 మార్చి 5న విజ‌య‌వాడ‌లోని వెంక‌టేశ్వ‌ర థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో 'నీడ' షూటింగ్ ప్రారంభ‌మైంది. ర‌మేశ్ మీదే తొలి షాట్ తీశారు. ఈ సినిమా షూటింగ్‌లో ర‌మేశ్‌, నారాయ‌ణ‌మూర్తిపై ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు దాస‌రి ఎంత‌గా చెప్తున్నా నారాయ‌ణ‌మూర్తి స‌రిగా చేయ‌లేక‌పోతూ వ‌చ్చారు. దాంతో దాస‌రికి ఓపిక న‌శించి ఫ‌ట్‌మ‌ని నారాయ‌ణ‌మూర్తిని కొట్టారు. అంత‌మంది ముందు త‌న‌ను కొట్టేస‌రికి ఆయ‌న‌కు ఉక్రోషం వ‌చ్చింది. "అదేంటి గురువుగారూ.. ర‌మేశ్‌బాబు అన్ని టేకులు తింటున్నా కొట్ట‌కుండా న‌న్ను మాత్ర‌మే కొట్టారు?" అనేశారు. దాంతో దాస‌రి మ‌రోసారి ఫ‌ట్‌మ‌ని కొట్టారు.

Also read: ​షాకింగ్.. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి!

"ర‌మేశ్‌బాబు ఈ వేషం కావాల‌ని అడ‌గ‌లేదురా. నిర్మాత‌లు అత‌నే కావాల‌నుకొని వెళ్లి అడిగారు. అమ్మానాన్న‌లు, ఊరు వ‌దులుకుని సినిమా ఫీల్డుకి వ‌చ్చిన‌వాడివి నువ్వు. న‌టించాల‌నే త‌ప‌న‌తో నా ద‌గ్గ‌ర‌కు వచ్చిన నిన్ను మంచి న‌టునిగా తీర్చిదిద్ద‌డం నా బాధ్య‌త‌. కాదంటావా?" అన్నారు దాస‌రి. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేల‌ను దాస‌రే స‌మ‌కూర్చారు.

Also read: ర‌మేశ్‌బాబు న‌ట ప్ర‌స్థానం.. 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' నుంచి 'ఎన్‌కౌంట‌ర్' దాకా!

నాలుగు కేంద్రాల్లో 'నీడ‌' శ‌త‌దినోత్స‌వం పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా 1980 మార్చి 15న చెన్నైలోని హోట‌ల్ చోళాలో విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హించారు నిర్మాత రామినేని సాంబ‌శివ‌రావు. ఈ స‌భ‌కు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు స‌భాధ్య‌క్ష‌త వ‌హించ‌గా, ముఖ్య అతిథిగా కృష్ణ‌, బ‌హుమ‌తి ప్ర‌దాత‌గా క‌రుణానిధి పాల్గొన్నారు.