Read more!

English | Telugu

చిరు కారణంగా చరణ్ చేయాల్సిన 'జోష్' చైతన్య చేశాడు!

సినీ పరిశ్రమలో ఒక హీరోకి అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సహజం. అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి మొదట ఈ కథని మెగా హీరో రామ్ చరణ్ తో చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నించాడు. అయితే చరణ్ కి కథ నచ్చినప్పటికీ, చిరంజీవి కారణంగా ఈ ప్రాజెక్ట్ లోకి చైతన్య వచ్చాడు.

దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.. అక్కినేని వారసుడు నాగ చైతన్యని తమ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల సిద్ధం చేసిన 'కొత్త బంగారు లోకం' కథని తీసుకెళ్ళి నాగార్జునకు వినిపించాడు దిల్ రాజు. కథ నచ్చినప్పటికీ, తన కుమారుడి మొదటి సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ తో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నాగార్జున ఆ కథని వద్దన్నాడు. దాంతో ఆ అవకాశం వరుణ్ సందేశ్ ని వరించింది.

కొంతకాలానికి దర్శకుడు వాసు వర్మ 'జోష్' కథని దిల్ రాజు కి చెప్పాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాసుకున్న ఈ కథ.. అప్పటికే 'చిరుత'తో హీరోగా పరిచయమైన చరణ్ కి బాగుంటుందని దిల్ రాజు భావించాడు. చరణ్ ని కలిసి కథ వినిపించగా అతనికి బాగా నచ్చింది. అయితే చిరంజీవి మాత్రం ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేశాడు. ప్రస్తుతం చరణ్ 'మగధీర' వంటి భారీ సినిమా చేస్తున్నాడని, ఈ టైంలో ఇలాంటి కథ చేయడం కరెక్ట్ కాదని చిరు అభిప్రాయపడ్డాడు. దాంతో చేసేదేం లేక దిల్ రాజు వెనుదిరిగాడు.

అయితే 'జోష్' కథని ఎంతగానో నమ్మిన దిల్ రాజు.. ఆ వెంటనే నాగార్జునని కలిసి కథ వినిపించాడు. కాస్త 'శివ' తరహా కథ కావడంతో బాగా ఎక్సైట్ అయిన నాగ్.. ఈ స్టోరీనే చైతన్య డెబ్యూకి కరెక్ట్ అని భావించి, వెంటనే ఓకే చెప్పాడు. అలా చైతూని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు జోష్ చిత్రాన్ని నిర్మించాడు. 2009 సెప్టెంబర్ లో విడుదలైన జోష్.. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది.

అలా చైతన్య చేయాల్సిన 'కొత్త బంగారు లోకం' వరుణ్ సందేశ్ దగ్గరకు వెళ్తే.. చరణ్ చేయాల్సిన 'జోష్'తో చైతన్య హీరోగా పరిచయమయ్యాడు.