Read more!

English | Telugu

చంద్రమోహన్‌ జీవితాన్నే మార్చేసిన యాక్సిడెంట్‌!

జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినపుడు.. యాక్సిడెంటల్‌గా జరిగింది అంటుంటాం. ఇలా యాక్సిడెంటల్‌గా జరిగిన ఘటనల వల్ల కొందరికి లాభం చేకూరవచ్చు, మరికొందరు నష్టాన్ని చవిచూడవచ్చు. ఏది ఏమైనా నటుడు చంద్రమోహన్‌ విషయంలో యాక్సిడెంటల్‌గా జరిగిన ఓ ఘటన అతని జీవితాన్నే మార్చేసింది. చంద్రమోహన్‌ బావ వేరెవరికో సినిమా అవకాశం కోసం ప్రముఖ దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి దగ్గరికి వెళ్లారు. తను చేస్తున్న సినిమాలోని నటుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను గురించి అతనికి వివరించాడు. దాంతో తన మా బావమరిది ఉన్నాడని, మీరు చెప్పిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయంటూ చంద్రమోహన్‌ను ఆ ప్రముఖ దర్శకుడికి పరిచయం చేశారు. అలా రంగులరట్నం చిత్రంతో చంద్రమోహన్‌ తెరంగేట్రం చేశారు. హీరో అంటే మంచి ఎత్తు, రంగు, ఆకర్షణీయమైన ముఖం ఉండడం కనీస అర్హత. కానీ, చంద్రమోహన్‌ విషయానికి వస్తే .. పొడుగు కాదు, మరీ పొట్టిగా ఉన్నాడు, రంగు, రూపు కూడా అంతంత మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోకి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా చంద్రమోహన్‌కి లేదు. 

అలాంటి చంద్రమోహన్‌.. కేవలం తనలోని ప్రతిభను మాత్రమే నమ్ముకొని.. 55 ఏళ్ల పాటు సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగింది 932 చిత్రాల్లో నటించారు. 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించి.. తన నటనతో ప్రేక్షకుల మనస్సును కత్తిరించి  చోరీ చేసిపారేశారు. ఆయన చేసిన క్యారెక్టర్ల గురించి ప్రస్తావించాల్సి వస్తే... ఐఎన్‌ మూర్తి దర్శకత్వంలో వచ్చిన సుఖదు:ఖాలు చిత్రంలో తన సోదరి వాణిశ్రీని ప్రేమించి, వంచించిన వ్యక్తిని హత్య చేసి.. ఆ తర్వాత.... అతడి ఇంట్లోనే దాక్కోవడం.. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన బంగారు పిచుకలో తల్లి చాటు కొడుకుగా ఉన్న చంద్రమోహన్‌ను కన్న తండ్రి బయట ప్రపంచం చూడరా బాబు అంటూ ఇంటి నుంచి పంపిచేయడం.. ఇక కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో విడదలైన సిరిసిరిమువ్వ చిత్రంలో సాంబయ్యగా.. సవతి తల్లి చేతిలో అవమానాలకు గురవుతున్న మూగ అమ్మాయి జయప్రద.. మోసగాడితో పెళ్లి అవుతుంటే.. ఆ పెళ్లిని ఆపేందుకు.. రా దిగి రా.. దివి నుంచి భువికి దిగా రా.. అంటూ డప్పు కొడుతూ ఊగిపోతు పాడడం.. అదే విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించి మరో చిత్రం సితామహాలక్ష్మీ. ఈ చిత్రంలో సీతాలు సింగారం.. మాలచ్చిమి బంగారు.. బంగారు కొండయ్య అంటే భగవంతుడవతారం అంటూ తాళ్లురి రామేశ్వరితో చంద్రమోహనుడి చట్టాపట్టాలు.. మళ్లీ ఆదే విశ్వనాథ్‌ దర్శకత్వంలోనే వచ్చిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంలో కామేశ్వరరావుగా అన్నవరంలో దేవుడి మెట్ల మీద... మర చెంబు, గ్లాసు, రాజ్యలక్ష్మీతో చూపులు కలిసిన శుభవేళ.. సీన్లు ఎలా ఉంటాయంటే... అన్నవరం సత్యదేవుని ప్రసాదంలా.. రుచిగా, శుచిగా మనస్సును ఇట్టే కట్టి పడేస్తాయి.  

ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కిన పదహరేళ్ల వయస్సు చిత్రంలో.. అమాయక దివ్యాంగుడి పాత్రలో చంద్రమోహన్‌ ఒదిగిపోయి నటిస్తే.. అప్పటికి జగదేక సుందరి పేరు సంపాదించుకోని శ్రీదేవితో కలిసి నటించిడం.. మరో విశేషం. బీరం మస్తాన్‌ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం సువర్ణసుందరి. ఈ చిత్రంలో భార్యనే ప్రేయసి భావించి.. ఆమెనే ఆరాధిస్తూ.. కవిత్వాన్ని రాసే భర్తగా చంద్రమోహన్‌ నటన నభూతో న భవిష్యత్‌.    

అలాగే ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో చెక్కిన శిల్పం రాధాకల్యాణం. ఈ చిత్రంలో అరవ అబ్బాయి పాల్ఘాటి మాధవన్‌గా చంద్రమోహన్‌.. అతడిని ప్రేమించే అమ్మాయిగా రాధిక నటన.. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం, పాటలు అన్ని ముగ్ద మనోహర గీతంలా ఉంటాయి. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లుడు గారు. ఇందులో లాయర్‌ పాత్రలో నటించిన చంద్రమోహన్‌ను పిప్పళ్ల బస్తా అంటూ మోహన్‌ బాబు ఆట పట్టించడం.. ఆ క్రమంలో చంద్రమోహన్‌ ప్రతిస్పందించే సన్నివేశాలు.. సరదా సరదాగా ఉంటాయి. 

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369లో వికట కవి తెనాలి రామకృష్ణగా ఆయన నటన ఆమోఘం. అలాగే కలికాలం, ఆమె, మన్మధుడు, 7/జీ బృందావన్‌ కాలనీ, వర్షం, గులాబీ, అతనొక్కడే.. ఇలా చెప్పుకొంటు పొతే చంద్రమోహన్‌ నటించిన ప్రతీ చిత్రం సినీ వినీలాకాశంలో చంద్రహాసమే. అదే విధంగా అయన పక్కన నటించిన ప్రతీ హీరోయిన్‌ ఆ వినీనాకాశంలో స్టార్‌ కాదు.. సూపర్‌ స్టార్‌ కాదు.. సూపర్‌ డూపర్‌ లేడి స్టార్స్‌గా ఎదిగి.. పేరు ప్రఖ్యాతి గాంచారు. అందుకు శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, రాజ్యలక్ష్మీ, ముంజల, తాళ్లూరి రామేశ్వరి భానుప్రియ, శాంతిప్రియ ఇలా జాబితా చాలా పెద్దదే.