Read more!

English | Telugu

అమితాబ్‌ బచ్చన్‌ ఆ క్యారెక్టర్‌ చెయ్యడానికి రజినీకాంత్‌ ఒప్పుకోలేదు.. ఏ సినిమాలోనో తెలుసా?

ఇప్పుడు స్టార్‌ హీరోలుగా వెలుగొందుతున్న వారు తొలిరోజుల్లో ఎలాంటి క్యారెక్టర్‌ చెయ్యడానికైనా సిద్ధపడేవారు. నటుడుగా నిలదొక్కుకునే ప్రయత్నంలో అలాంటి నిర్ణయం తీసుకునేవారు. కొందరు విలన్‌గానే పరిచయమై ఆ తర్వాత హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్యకాలంలో ఒక భాషలో హీరో అయినప్పటికీ మరో భాషలో విలన్‌గా నటించేందుకు వెనుకాడడం లేదు. నటుడు అన్న తర్వాత అన్ని తరహా క్యారెక్టర్లు చెయ్యాలనేది వారి ఆలోచన. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ నుంచి అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ అలీఖాన్‌ వంటి హీరోలు టాలీవుడ్‌లో విలన్స్‌గా నటించారు. అలాగే తమిళ్‌ నుంచి ఆర్య, విజయ్‌సేతుపతి వంటి హీరోలు ఇక్కడ విలన్స్‌గా రాణించారు. అయితే కొందరు హీరోలు మాత్రం తమ కెరీర్‌లో హీరోలుగానే నటించారు తప్ప విలన్స్‌గా చేయలేదు. కనీసం నెగెటివ్‌ టచ్‌ ఉన్న క్యారెక్టర్స్‌ కూడా చేయలేదు. అలాంటివారిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని కెరీర్‌లో కొన్ని వందల సినిమాలు చేసినా ఎప్పుడూ విలనీ జోలికి వెళ్ళలేదు. అయితే అమితాబ్‌ని విలన్‌ చెయ్యాలని డైరెక్టర్‌ శంకర్‌ ప్రయత్నించారు. 

2010లో వచ్చిన ‘రోబో’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక విశేషం ఉంది. అదేమిటంటే ఈ సినిమాలో విలన్‌గా డ్యానీ నటించారు. మొదట ఈ క్యారెక్టర్‌ని అమితాబ్‌ బచ్చన్‌కి ఆఫర్‌ చేశాడు శంకర్‌. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో తేల్చుకోలేని అమితాబ్‌.. రజినీకాంత్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ‘సర్‌, మిమ్మల్ని ప్రేక్షకులు విలన్‌గా అంగీకరించలేరు. ఈ పాత్ర చేయకుండా ఉంటేనే మంచిది’ అని సూచించారు రజినీ. ఆ మాటతో ‘రోబో’ సినిమా చేయడానికి అమితాబ్‌ ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని అమితాబ్‌ స్వయంగా ఒక సందర్భంలో వెల్లడిరచారు. ఆ తర్వాత ‘2.0’లో అమితాబ్‌ విలన్‌గా నటించబోతున్నాడని సోషల్‌ మీడియాలో రూమర్‌ వచ్చింది. అక్షయ్‌కుమార్‌ అందులో విలన్‌గా నటించడంతో అది రూమరేనని తెలిసింది. 

అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌ కలిసి గతంలో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి చేసినవి హిందీ సినిమాలే కావడం విశేషం. ‘అంధా కానూన్‌’, ‘గిరఫ్‌తార్‌’, ‘హమ్‌’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. ‘హమ్‌’ 1991లో వచ్చింది. దాదాపు 33 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్‌’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.