Read more!

English | Telugu

45 ఏళ్ల క్రితం ఆ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ కలిసి హ్యాట్రిక్‌ కొట్టారు.. మరి ఆ తర్వాత! 

1978 సంవత్సరం నాటికి హీరో కృష్ణ టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజినీకాంత్‌ అప్పుడు అప్‌కమింగ్‌ హీరో. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్‌ కలిసి హ్యాట్రిక్‌ కొట్టారు. అయితే వారి స్నేహబంధం మాత్రం నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగింది. రజినీకాంత్‌కు కృష్ణ అంటే అపారమైన గౌరవం. కృష్ణను తొలిసారి కలిసినప్పుడు ఎంత గౌరవించారో అదే గౌరవం తను సూపర్‌స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా కనబరిచేవారు. వీరిద్దరూ కలిసి నటించిన మూడు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలుసుకుందాం. 

సూపర్‌స్టార్‌ కృష్ణ, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కలిసి నటించిన తొలి చిత్రం ‘అన్నదమ్ముల సవాల్‌’. కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సారథీ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. కన్నడలో సూపర్‌హిట్‌ అయిన ‘సహోదర సవాల్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. కన్నడలోనూ ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ఆర్‌.దాసే రూపొందించారు. విశేషం ఏమిటంటే కన్నడ వెర్షన్‌కి పనిచేసిన టెక్నీషీయన్స్‌ అందరూ తెలుగు వెర్షన్‌కి కూడా పనిచేశారు. ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం  కురిపించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే కృష్ణ, రజినీకాంత్‌ల స్నేహం ఎంతో బలపడిరది. ఈ సినిమా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఔట్‌డోర్‌ షూటింగ్‌ ఉన్నప్పుడు తన సొంత కారులోనే వెళ్ళడం కృష్ణకు మొదటి నుంచీ అలవాటు. అందుకే మద్రాస్‌ నుంచి తన కారును హైదరాబాద్‌ తెచ్చుకున్నారు. ఒకరోజు షూటింగ్‌కి బయల్దేరుతుండగా రజినీకాంత్‌ వచ్చి కృష్ణను కలిసి ‘అన్నయ్యా.. లొకేషన్‌కి మీ కారులో రావచ్చా..’ అని ఎంతో వినయంగా, మరికొంత భయంగానూ అడిగారు. అప్పటికే టాలీవుడ్‌లో కృష్ణ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. రజినీకాంత్‌ అప్‌కమింగ్‌ హీరో. అంత పెద్ద హీరో తనని కారులో తీసుకెళ్తారా అనే సందేహంతోనే లిఫ్ట్‌ అడిగారు. అడగాలే గానీ, దేన్నీ కాదనని కృష్ణ ఒక నవ్వు నవ్వేసి రజినీని తన కారులో ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ‘అన్నయ్యా.. జీవితంలో నేను ఇలాంటి కారు కొనగలనా..’ అన్నారు రజినీ. దానికి కృష్ణ ‘నీ టాలెంట్‌ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మంచి హీరోగా ఎదుగుతావు. డబ్బు, పేరు సంపాదిస్తావు’ అని భుజం తట్టి ప్రోత్సహించారు. కృష్ణది ఎంత గొప్ప మనసో అప్పుడు రజినీకాంత్‌కి అర్థమైంది. అందుకే ఆనాటి నుంచి కృష్ణను తన సొంత అన్నయ్యలాగే భావించేవాడు రజినీ. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘అన్నదమ్ముల సవాల్‌’ ఘనవిజయం సాధించింది. రజినీకాంత్‌కు హీరోగా మంచి పేరు వచ్చింది. ఇందులోని పాటలు అప్పట్లో సూపర్‌హిట్‌ అయ్యాయి. 

‘అన్నదమ్ముల సవాల్‌’ ఘనవిజయం సాధించడంతో ఇదే కాంబినేషన్‌లో ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రాన్ని రూపొందించారు. అన్నదమ్ముల సవాల్‌ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్‌తోనే సారథీ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాలో కృష్ణ, రజినీకాంత్‌ బావబావమరుదులుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలు కూడా ఎంతో ఆదరణ పొందాయి. ఇలా కృష్ణ, రజినీ నటించిన రెండు సినిమాలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. అదే సమయంలో కె.వాసు దర్శకత్వంలో మహేంద్ర ‘తోడుదొంగలు’ అనే సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యం ఉండడంతో హీరోలుగా కృష్ణ, రజినీకాంత్‌ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారు. దానికి కృష్ణ ఓకే చెప్పారు. అయితే రజినీకాంత్‌ డేట్స్‌ మాత్రం దొరకలేదు. దీంతో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చిరంజీవిని ఎంపిక చేశారు. 

ఇక కృష్ణ, రజినీ కలిసి నటించిన మూడో సినిమా ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా, రిషి కపూర్‌ హీరోలుగా రూపొందిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమా ప్రారంభమయ్యే సమయానికి రజినీకాంత్‌ తమిళ్‌లో స్టార్‌ హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్నారు. రజినీకాంత్‌ అంటే కృష్ణకు వున్న అభిమానం కొద్దీ ఈ సినిమాలో రజినీకాంత్‌ని ఓ హీరోగా బుక్‌ చేయమని నిర్మాత సూర్యనారాయణబాబుకి సూచించారు. నిర్మాత రజినీని సంప్రదించి విషయం చెప్పారు. దానికి రజినీ వెంటనే ఒప్పుకున్నారు. హిందీ వెర్షన్‌కి మన్‌మోహన్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించగా, తెలుగు వెర్షన్‌ని విజయనిర్మల డైరెక్ట్‌ చేశారు. ఇందులో రామ్‌గా రజినీకాంత్‌, రాబర్ట్‌గా కృష్ణ, రహీమ్‌గా చంద్రమోహన్‌ నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధించి కృష్ణ, రజినీకాంత్‌లకు హ్యాట్రిక్‌ మూవీ అయింది. 

ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానప్పటికీ రజినీకాంత్‌ హీరోగా పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌లో ‘మా వీరన్‌’ అనే సినిమాను తమిళ్‌లో నిర్మించారు కృష్ణ. 1986లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సింహాసనం’ చిత్రం శతనోత్సవానికి రజినీకాంత్‌ ముఖ్యఅతిథిగా హాజరై యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు అందించారు. కృష్ణ బంగారం లాంటి మనిషని, ఆయనతో కలిసి మూడు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించడం తన జీవితంలో మరచిపోలేని గొప్ప విషయమని ఇప్పటికీ చెబుతుంటారు రజినీకాంత్‌.