Read more!

English | Telugu

సిగరెట్స్‌ కోసం లొల్లి.. షూటింగ్‌కి రానని భీష్మించుకు కూర్చున్న ఎన్‌.టి.రామారావు!

1964లో ఎన్‌.టి.రామారావు, కృష్ణకుమారి, జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘గుడిగంటలు’. వి.మధుసూదనరావు దర్శకత్వంలో డూండీ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ‘ఆలయమణి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో శివాజీ గణేశన్‌ చేసిన పాత్రను తెలుగులో ఎన్‌.టి.రామారావు పోషించారు. ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించారు ఎన్టీఆర్‌. ఆయన క్యారెక్టర్‌లో శాడిజం ఉంటుంది. అయితే అలాంటి పాత్రకు సిగరెట్‌ తాగడం వంటి వ్యసనం కూడా ఉంటుంది. సాధారణంగా ఎన్టీఆర్‌ సిగరెట్‌ కాల్చరు. ఆయన ఎక్కువగా చుట్ట కాలుస్తారని చాలా మందికి తెలుసు. అయితే సినిమా కోసం సిగరెట్లు తాగాల్సి వచ్చింది. అలాంటి క్యారెక్టర్‌ చెయ్యాల్సి వచ్చినపుడు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే ఫారిన్‌ బ్రాండ్‌ సిగరెట్లు కాల్చేవారు. ‘గుడిగంటలు’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులు రోజుకి రెండు డబ్బాలు ఖాళీ చేసేవారు. ఆరోజుల్లో గుండ్రటి డబ్బాలో 20 సిగరెట్లు ఉన్న ప్యాక్‌ లభించేది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఒక డబ్బా, లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఒక డబ్బా ఎన్టీఆర్‌కి అందించాలి.

ఒకరోజు యధావిధిగా షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌తో సహా యూనిట్‌లోని వారంతా లంచ్‌ ముగించుకున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు రాసిన ముళ్లపూడి వెంకటరమణకు సిగరెట్‌ కావాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ కోసం తెప్పించిన సిగరెట్స్‌ డబ్బా సీల్‌ తీసి అందులో నుంచి రెండు సిగరెట్లు తీసుకొని ముళ్ళపూడి, పక్కనే ఉన్న నిర్మాత డూండీ చెరొకటి ఊది పారేశారు. లంచ్‌ తర్వాత రెస్ట్‌ తీసుకొని సిగరెట్‌ డబ్బా కోసం కబురు పెట్టారు ఎన్టీఆర్‌. ప్రొడక్షన్‌ బోయ్‌ వెళ్లి సిగరెట్‌ డబ్బాను ఆయనకు అందించాడు. సీల్‌ తీసి ఉన్న సిగరెట్‌ డబ్బాను చూసిన ఎన్టీఆర్‌ ఉగ్రుడైపోయారు. బోయ్‌ మీద కేకలు వేసి తిప్పి పంపారు. నిర్మాతకు విషయం చెప్పాడు బోయ్‌. సీల్‌ తీస్తే ఏమైందట.. ప్రొడ్యూసర్‌, రైటర్‌ రెండు సిగరెట్లు తాగారని చెప్పమని బోయ్‌ని మళ్ళీ ఎన్టీఆర్‌ దగ్గరకు పంపించారు. బోయ్‌ చెప్పిన మాట విని మరింత కోపంతో ఊగిపోయారాయన. సీల్డ్‌ డబ్బా తెచ్చి ఇస్తేనే సెట్‌కి వచ్చేది. లేకపోతే లేదు అన్నారు. 

సిగరెట్ల కోసం గొడవెందుకని భావించిన డూండీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ని పిలిచి అతనికి కారు ఇచ్చి పంపారు. అవి ఫారిన్‌ సిగరెట్స్‌ కావడంతో ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. కొన్ని కిలోమీటర్లు తిరిగి ఎలాగైతే సిగరెట్లు సంపాదించాడు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌. వెంటనే ఆ డబ్బాను ఎన్టీఆర్‌కు అందించేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది. ఈ విషయమై ముళ్ళపూడి, డూండీ.. ఎన్టీఆర్‌కు సారీ చెప్పారు. ‘సిగరెట్‌ కోసం కాదు బ్రదర్‌. ప్రిన్సిపల్‌ ఇంపార్టెంట్‌. దానికి నేను కూడా అతీతుడ్ని కాదు’ అంటూ సెట్‌వైపు అడుగులు వేశారు ఎన్‌.టి.రామారావు.