English | Telugu
దీన స్థితిలో ఉన్న హరనాథ్‌ను అక్కున చేర్చుకున్న సూపర్‌స్టార్.. రెండో రోజే కబళించిన మృత్యువు!
Updated : Jan 25, 2024
సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెడతారు. కొందరు హీరోలు కావాలనుకుంటే, మరికొందరు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. మరికొందరు టెక్నీషియన్స్‌గా తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలని ఆశపడతారు. అయితే టాలెంట్‌తోపాటు అదృష్టం కూడా తోడైతేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలా ఉన్నత శిఖరాలను చేరుకున్న వారిలో కొంతమంది తమ జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల ముందు జాగ్రత్త లేక పాతాళానికి తోసి వేయబడతారు. దీనావస్థలో జీవితాన్ని ముగిస్తారు. అలాంటి వారిలో పాతతరం హీరో హరనాథ్ ఒకరు.
ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి గొప్ప నటుల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరో హరనాథ్. ఎంతో అందగాడైన హరనాథ్‌ను రొమాంటిక్ హీరో అని పిలిచేవారు. తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరో అనే పిలుపు హరనాథ్‌తోనే మొదలైంది. అప్పట్లోనే లేడీ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో హరనాథ్. ‘మాయింటి మహాలక్ష్మీ’ చిత్రంతో నటుడిగా పరిచయమైన హరనాథ్ ఆ తర్వాత కలిసి ఉంటే కలదు సుఖం, గుండమ్మ కథ, లేత మనసులు, పెళ్లిరోజు, మురళీకృష్ణ వంటి సినిమాలో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఎన్టీరామారావు దర్శకత్వంలో వచ్చిన సీతారామకళ్యాణం చిత్రంలో వేసిన రాముడి పాత్ర హరనాథ్‌కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత భీష్మ చిత్రంలో కృష్ణుడిగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 130 సినిమాల్లో నటించారు హరనాథ్. అప్పట్లో హరనాథ్ అంటే లగ్జరీకి మారు పేరుగా చెప్పుకునేవారు. అదే అతని పాలిట శాపంగా మారింది. కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే జాగ్రత్త పడకుండా మద్యానికి బానిసయ్యారు. తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నారు. అవకాశాలు కూడా తగ్గాయి. సెట్స్‌కి వెళితే పిచ్చివాడిని చూసినట్టు చూసేవారు. స్టూడియో నుంచి బయటికి గెంటేసిన అనుభవాలు కూడా హరనాథ్‌కి ఎదురయ్యాయి. క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది. అప్పటివరకు హరనాథ్‌ను తమ చుట్టూ తిప్పుకున్న హీరోయిన్లు కూడా అతని పరిస్థితి చూసి మొహం చాటేసారు. ఒకసారి హైదరాబాద్ వచ్చినపుడు పద్మాలయా స్టూడియో గేటు దగ్గర ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు హరనాథ్. మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో బిచ్చగాడిలా కనిపించిన అతన్ని సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. అదే సమయంలో నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి దూరదర్శన్ కోసం ఓ సీరియల్ షూటింగ్‌లో పాల్గొనడానికి అక్కడికి వచ్చాడు. హరనాథ్‌ని గుర్తుపట్టి పలకరించాడు. కృష్ణను కలిసేందుకు వచ్చానని చెప్పడంతో అతన్ని కృష్ణ దగ్గరికి తీసుకెళ్లాడు పృథ్వి.
తన స్నేహితుడు హరనాథ్‌ను ఆ స్థితిలో చూసిన సూపర్‌స్టార్ కృష్ణ కంటతడి పెట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా వ్యసనాలకు బానిసైన హరనాథ్‌ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు కృష్ణ. తన కాస్ట్యూమర్‌ని పిలిచి హరనాథ్‌ను పెళ్లికొడుకులా ముస్తాబు చెయ్యాలని చెప్పారు. వెంటనే హరనాథ్‌కు స్నానం చేయించి అందంగా తయారు చేశారు. అలా తన దగ్గరే వారం రోజుల పాటు ఉంచుకొని నిజమైన స్నేహితుడు అనిపించుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. ఆ తర్వాత అవసరమైన డబ్బు ఇచ్చి హరనాథ్‌ను మద్రాస్ పంపించారు. అలా వెళ్లిన రెండో రోజే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు హరనాథ్. ఆ వార్త విన్న కృష్ణ భోరున విలపించారట. తన దగ్గర ఉంచుకున్నా బాగుండేది అని బాధ పడ్డారట. అలా ఓ గొప్ప నటుడి జీవితం అత్యంత దీనావస్థలో ముగిసింది.