Read more!

English | Telugu

ఎన్టీఆర్‌, పూరి ఇద్దరూ అడిగినా ఆ క్యారెక్టర్‌ నారాయణమూర్తి ఎందుకు చెయ్యలేదో తెలుసా?

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్‌’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. 2004లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవలేదు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత 2015లో బండ్ల గణేష్‌ నిర్మాతగా ‘టెంపర్‌’ చిత్రం తెరకెక్కింది. ఒక డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా ఘనవిజయం సాధించి కలెక్షన్లపరంగా సంచలనం సృష్టించింది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. అతని దగ్గర పనిచేసే కానిస్టేబుల్‌ క్యారెక్టర్‌ను పోసాని కృష్ణమురళి పోషించారు. రచయితగా, నటుడిగా ఎన్నో విజయాలను అందుకున్న పోసానికి తన కెరీర్‌లోనే గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమాలోని మూర్తి అనే పాత్ర. వాస్తవానికి ఈ క్యారెక్టర్‌ను పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తితో చేయించాలనుకున్నాడు పూరి జగన్నాథ్‌. తనకు ఎంతో ఇష్టమైన నటుడు నారాయణమూర్తి అని ఎన్నో సందర్భాల్లో పూరి జగన్నాథ్‌ చెప్పారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన తర్వాత ఆర్‌.నారాయణమూర్తి చేసిన సినిమాలన్నీ విప్లవ నేపథ్యం లేదా ప్రజా సమస్యల నేపథ్యంలో రూపొందినవే. ‘టెంపర్‌’ చిత్రంలోని మూర్తి క్యారెక్టర్‌ కూడా నారాయణమూర్తి మనస్తత్వాన్ని పోలి ఉంటుంది. అందుకే అతనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడని భావించిన పూరి.. నారాయణమూర్తిని సంప్రదించి విషయం చెప్పాడట. కానీ, తను ఆ క్యారెక్టర్‌ చెయ్యలేనని ఎంతో సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాడట. ఎన్టీఆర్‌ కూడా ఈ విషయంలో నారాయణమూర్తిని రిక్వెస్ట్‌ చేశాడట. కానీ, లాభం లేకపోయింది. 

పూరి జగన్నాథ్‌లాంటి టాప్‌ డైరెక్టర్‌ చేస్తున్న సినిమా పైగా ఎన్టీఆర్‌ లాంటి టాప్‌ హీరో కాంబినేషన్‌లో చేసే క్యారెక్టర్‌ను ఎందుకు కాదన్నాడు అనేది పూరికి, ఎన్టీఆర్‌కి అర్థం కాలేదు. మూర్తి పాత్ర తను చేయకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆ తర్వాత ఓ సందర్భంలో వెల్లడిరచారు నారాయణమూర్తి. ‘‘టెంపర్‌’లోని మూర్తి క్యారెక్టర్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో డౌట్‌ లేదు. అంత మంచి క్యారెక్టర్‌ నాతో చేయించాలనుకున్న పూరికి నేను సెల్యూట్‌ చేస్తున్నాను. నాతో ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయించాలనే ఉద్దేశంతోనే పూరి నన్ను సంప్రదించారు. ఎన్టీఆర్‌ కూడా ఎంతో ప్రేమగా ఈ విషయాన్ని అడిగారు. అయినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే జూనియర్‌ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశాను. చివరికి హీరోని అయ్యాను. అందుకే ఇకపై మళ్ళీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే పూరి ఇచ్చిన ఆఫర్‌ను కాదన్నాను. అంతే తప్ప మరో కారణం ఏమీ లేదు’ అన్నారు నారాయణమూర్తి.