Read more!

English | Telugu

అలాంటి మంచి లక్షణాల వల్లే మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు!

సినిమా రంగంలో ఎవరి అండా లేదు. కేవలం స్వయంకృషితోనే చిరంజీవి మెగాస్టార్‌ అయ్యారు అని అందరూ చెబుతుంటారు. అయితే ఆయన ఆ స్థానానికి రావడానికి స్వయంకృషే కాదు, మంచితనం, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతల పట్ల ఉండే అపారమైన గౌరవం, ఎదుటివారికి ఇచ్చే మర్యాద.. ఇలాంటి లక్షణాలు కూడా ఆయనలో ఉండడం వల్ల మెగాస్టార్‌ చిరంజీవి అందరివాడు అయ్యారు. ఆయన తన దర్శకనిర్మాతల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో తెలిపే ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి మొదట నటించిన సినిమా ‘పునాది రాళ్ళు’. అయితే ‘ప్రాణం ఖరీదు’ మొదట విడుదలైన సినిమా. ఆయన నటించిన ఆరు సినిమాల తర్వాత ‘పునాదిరాళ్ళు’ విడుదలైంది. 1980 వరకు దాదాపు 15 సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు చిరంజీవి. అప్పట్లో చిరు కుటుంబం నెల్లూరులో నివాసం ఉండేది. అప్పటికే సినిమాల్లో నటిస్తున్న చిరంజీవిని తమ ఊరి ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో 1980 ఆగస్ట్‌ 21న నెల్లూరులో ఒక ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని భావించారు చిరు తండ్రి. ఆగస్ట్‌ 22 చిరంజీవి బర్త్‌డే. ఒకరోజు ముందు ఆ ప్రెస్‌మీట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని మద్రాస్‌లో ఉన్న చిరంజీవికి చెప్పారు. ఆగస్ట్‌ 21 ఉదయం 10 గంటలకు బయల్దేరతాను అని చెప్పారు చిరు. ఈలోగా చిరంజీవికి ఒక ఆలోచన వచ్చింది. 1980లో వచ్చిన ‘జాతర’ సినిమాలో ఆయన హీరో. ఆ సినిమాలో ధరించిన ఒక కాస్ట్యూమ్‌ అంటే అతనికి చాలా ఇష్టం. తెల్ల ప్యాంట్‌, బ్లూ షర్ట్‌. ఆ డ్రెస్‌లో ప్రెస్‌మీట్‌కి వెళితే బాగుంటుందనిపించి ‘జాతర’ నిర్మాత రుద్రరాజు సీతారామరాజుకి ఫోన్‌ చేసి కాస్ట్యూమ్‌ విషయం చెప్పారు. దానికా నిర్మాత ఆ కాస్ట్యూమ్స్‌ అన్నీ జాగ్రత్త పెట్టామని, ఆ కాస్ట్యూమ్‌ని బయటికి తీసి వాష్‌ చేయించి రెడీగా పెడతానని, ఉదయమే వచ్చి తీసుకోమని చెప్పారు. ఆగస్ట్‌ 21 ఉదయం నిర్మాత సీతారామరాజు ఆఫీస్‌కి వెళ్లారు చిరు. అప్పటికే చిరంజీవికి ఒక ఫియట్‌ కారును కొనిచ్చారు ఆయన తండ్రి. ఆ కారులోనే సినిమా ఆఫీసులకు వెళ్లేవారు చిరు. ఆ కారులోనే నెల్లూరుకి బయల్దేరుతూ సీతారామరాజు ఆఫీస్‌కి వచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఆ కాస్ట్యూమ్‌ను సిద్ధం చేసి ఉంచారు సీతారామరాజు. అప్పటికే ఆ ఆఫీస్‌లో ముగ్గురు, నలుగురు నిర్మాతలు ఉన్నారు. అప్పట్లో సీతారామరాజు ఆఫీస్‌లో ఉదయమే రుచికరమైన మంచి టిఫిన్‌ పెట్టేవారనే పేరు ఉంది. దాంతో కొందరు నిర్మాతలు అక్కడికి వచ్చి టిఫిన్‌ చేసి వెళ్లేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా అప్పుడప్పుడు అక్కడ టిఫిన్‌ చేసేవారు. దాంతో ఎప్పుడూ దర్శకనిర్మాతలతో సీతారామరాజు ఆఫీసు కళకళలాడుతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ ఉన్న నిర్మాతల్లో చిరంజీవితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత కూడా ఉన్నారు. ఆయన్ని చిరంజీవి ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుస్తారు. ఆ నిర్మాత చిరంజీవి కొత్త కారును చూసి ముచ్చటపడ్డాడు. పది నిమిషాల్లో ఒక రౌండ్‌ వేసుకొని వస్తానని చెప్పడంతో కారు కీస్‌ ఇచ్చారు చిరంజీవి. అలా వెళ్లిన ఆ నిర్మాత రెండు గంటలు గడిచినా రాలేదు. మద్రాస్‌లో 10 గంటలకు బయల్దేరితేనే 3 గంటలకు నెల్లూరు చేరుకోవచ్చు. కనీసం 12 గంటలకు బయల్దేరినా ప్రెస్‌మీట్‌ టైమ్‌కి చేరుకోవచ్చు. కానీ, ఆ నిర్మాత రాలేదు. ఆయన కోసం ఓపికగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. చివరికి నాలుగున్నరకు ఆ నిర్మాత వచ్చారు. ‘సారీ తమ్ముడూ.. ఎవరో సైట్‌ చూద్దామంటే బీచ్‌ రోడ్‌కి వెళ్లాము’ అని కారు కీస్‌ ఇచ్చాడు. ఆయన చేసిన పనికి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ‘ఫర్వాలేదు.. అన్నయ్యా.. నో ప్రాబ్లమ్‌’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు చిరంజీవి.

సాయంత్రం ఐదు గంటలకు మిత్రుడు, నటుడు హరిప్రసాద్‌, నిర్మాత రుద్రరాజు సీతారామరాజుతో కలిసి నెల్లూరు బయల్దేరారు చిరంజీవి. ఆరోజు ప్రెస్‌ మీట్‌ మిస్‌ అయిపోయింది. తనతోపాటు వచ్చిన నిర్మాత సీతారామరాజుకి మంచి హోటల్‌లో రూమ్‌ తీసి ఆ రాత్రికి అక్కడే ఉండే ఏర్పాటు చేశారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు, అభిమానులు, హరిప్రసాద్‌, సీతారామరాజులతో కలిసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు చిరంజీవి. తన నిర్మాతలంటే చిరంజీవికి ఎంత గౌరవమో, వారి పట్ల ఎంత మర్యాదగా నడుచుకుంటారు అనే విషయం ఈ సంఘటన తెలియజేస్తుంది. ఆ నిర్మాత వల్ల తనకు కలిగిన అసౌకర్యాన్ని మనసులో పెట్టుకోకుండా తను ముందుగా కమిట్‌ అయిన విధంగానే అతనికి ఒక సినిమా చేశారు చిరంజీవి. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.