Read more!

English | Telugu

రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకున్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా?

ఆలిండియా స్టార్‌గా శ్రీదేవికి ఎంత పాపులారిటీ వుండేదో అందరికీ తెలిసిందే. ఎక్కువ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గ్లామర్‌ హీరోయిన్‌కి నిర్వచనం నిలిచిన శ్రీదేవి.. రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకుంది. ఎందుకు అలా చేసింది అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు రూ.2,300 కోట్లు కలెక్ట్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌ ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక యూనిట్‌లోని ప్రతి ఒక్కరి కృషీ ఉంది. అయితే డైరెక్టర్‌ ఈజ్‌ కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు కాబట్టి ఎక్కువ క్రెడిట్‌ రాజమౌళికే దక్కింది. 2017లో ‘బాహుబలి’ రెండో భాగం రిలీజ్‌ అయిన తర్వాత రాజమౌళి ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ శ్రీదేవిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలిలోని శివగామి క్యారెక్టర్‌ కోసం మొదట శ్రీదేవిని అనుకున్నామని, ఆమె ఒప్పుకోకపోవడమే మాకు కలిసొచ్చిందని అన్నాడు. అంతటితో ఆగకుండా ఆమె ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. రెమ్యునరేషన్‌ రూ.8 కోట్లు డిమాండ్‌ చేసిందని, 10 ఫ్లైట్‌ టికెట్స్‌ కావాలని, తన కోసం హోటల్‌లోని ఒక ఫ్లోర్‌ మొత్తం తీసుకోవాలని, ఈ సినిమా హిందీ వెర్షన్‌లో లాభాల్లో వాటా అడిగిందని, అందుకే శ్రీదేవిని తీసుకోలేదని చెప్పాడు. 

రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది, కంటతడి పెట్టుకుంది. ఈ విషయం గురించి తన స్పందన తెలియజేస్తూ ‘ఈ విషయం గురించి నన్ను చాలా మంది అడిగారు. కానీ, నేనెప్పుడూ దీని గురించి మాట్లాడలేదు. నేను కొన్ని కారణాల వల్ల చాలా సినిమాలు చెయ్యలేకపోయాను. అవి చాలా పెద్ద హిట్‌ అయ్యాయి కూడా. ఆ సినిమాలు చెయ్యాలని నాకు రాసిపెట్టి లేదు అనుకునేదాన్ని తప్ప మరోలా బాధపడేదాన్ని కాదు. ఆ సినిమాల గురించి ఆ సినిమాల డైరెక్టర్లుగానీ, నిర్మాతలుగానీ, నేను గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు బాహబలి విషయానికి వస్తే నేను ఆ క్యారెక్టర్‌ చెయ్యలేదు.. ఎవరో చేశారు. పార్ట్‌ 1, పార్ట్‌ 2 రెండూ రిలీజ్‌ అయిపోయాయి. దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఈ విషయం గురించి ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. అసలు మాట్లాడకూడదనే అనుకున్నాను. కానీ, దీన్ని క్లియర్‌ చెయ్యాల్సిన బాధ్యత నాకు ఉంది. రాజమౌళిగారు చెప్పినంత అన్యాయంగా నేను డిమాండ్‌ చేసి ఉంటే 50 సంవత్సరాల్లో 300కి పైగా సినిమాలు చేసి ఉండేదాన్నా. నన్ను ఎప్పుడో ప్యాక్‌ చేసి పంపించేసేవారు. ఈ మిస్‌ అండర్‌స్టాండిరగ్‌ ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. నన్ను ఆ సినిమా నుంచి తప్పించడానికి నిర్మాతే రాజమౌళిగారికి అలా చెప్పి ఉంటారా అని తర్వాత ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తోంది. రాజమౌళిగారు డైరెక్ట్‌ చేసిన ‘ఈగ’ సినిమా చూశాను. నాకు ఎంతో నచ్చింది. ఆయన డైరెక్ట్‌ చేసే సినిమాలో నటించడం నాకూ ఇష్టమే. కానీ, అంత గొప్ప డైరెక్టర్‌ నా గురించి అలా మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. ఇన్ని సంవత్సరాల నా కెరీర్‌లో నా గురించి నెగెటివ్‌గా మాట్లాడినవారు రాజమౌళి ఒక్కరే. ‘బాహుబలి’ సినిమా గురించి డైరెక్ట్‌గా ఆయన మాతో మాట్లాడలేదు. నా భర్త బోనీకపూర్‌తోనే మాట్లాడారు. ఆయన కూడా చాలా పెద్ద నిర్మాత. ప్రొడ్యూసర్స్‌కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం ఆయనకి కూడా తెలుసు. డెఫినెట్‌గా ఆయన అలాంటి డిమాండ్స్‌ చెయ్యరు. ఆ సినిమా చేయకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. నేను దీని గురించి ఏం మాట్లాడాననే వివరాలు కూడా తెలుసుకోకుండా నిర్మాత చెప్పిందే నమ్మి.. ఒక పెద్ద ఛానల్‌లో పబ్లిక్‌గా నాపై విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌? నేను ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేశాను. కానీ, ఏ ఒక్క డైరెక్టర్‌ నన్ను ఇలా బాధ పెట్టలేదు. ఇప్పటివరకు రాజమౌళితో కలిసి నేను పనిచేయలేదు. అయినా నా గురించి పూర్తిగా తెలిసినట్టు నాపై నిందలు మోపడం నిజంగా నన్ను బాధించింది’ అన్నారు.