English | Telugu
సి.నా.రె పాటను మహదేవన్ ట్యూన్ చెయ్యలేనన్నారు.. తర్వాత అదే పది కాలాలపాటు నిలిచే పాట అయింది!
Updated : Nov 15, 2023
కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలో ఒక ఆణిముత్యం ‘చెల్లెలి కాపురం’. ఈ చిత్రం గురించి చెప్పాల్సి వస్తే.. ఆరోజుల్లో విభిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమాగా పేరు తెచ్చుకుంది. శోభన్‌బాబు, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నటుడు, నిర్మాత ఎం.బాలయ్య నిర్మించారు. 1971లో వచ్చిన ఈ సినిమా ప్రథమ ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ అందించిన సంగీతం పెద్ద హైలైట్‌గా నిలిచింది. ‘కనుల ముందు నీవుంటే.. కవిత పొంగి పారదా..’, ‘ఆడవే మయూరి.. నటనమాడవే మయూరీ..’ అనే పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ‘ఆడవే మయూరి..’ పాట గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కెరీర్‌లో చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.
ఈ పాట రూపొందే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. పాటను డా. సి.నారాయణరెడ్డి రచించారు. పాటకు ట్యూన్ కట్టించేందుకు మహదేవన్ దగ్గరికి వెళ్లారు. ఈ పాట చివరి చరణం కొన్ని కఠినమైన సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. ‘ప్రళయ కాల సంకలిత భయంకర.. జలధరార్బుటుల చలిత దిక్కుటుల.. జటిత దిక్కురుల వికృత ఫీుంకృతుల .. సహస్రఫణ సంచలిత భూకృతుల..’... ఇలా సాగుతుందా పాట. ఆ పదాలను నారాయణరెడ్డిగారు వినిపించగానే ‘ఇది పాటకు పనికిరాదు. ఇన్ని సంస్కృత పదాలు, ఇంత జఠిలమైన పదాలతో పాటను ఎలా ట్యూన్ చేస్తాం’ అన్నారు మహదేవన్. దానికి నారాయణరెడ్డిగారు ‘మామా.. ఒక కవికి, డాన్సర్‌కి మధ్య జరిగే పోటీ అది. దానికి ఇలాంటి పదాలు పడితేనే గానీ కిక్కు రాదు’ అని మహదేవన్‌ని కన్విన్స్ చేశారు. ఆ తర్వాత ఆయన ఆ పాటను ట్యూన్ చేయడం జరిగింది. ఆ పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఎవరైనా గాయకుడు అవ్వాలని ప్రయత్నించేవారు తప్పకుండా ఈ పాట పాడి అందర్నీ అలరించాలని కోరుకుంటారు. ఘంటసాల పాడిన ‘చంద్రకళాధరి ఈశ్వరి’ పాట, ఎస్.పి.బాలు పాడిన ‘ఆడవే మయూరి.. ’ ఈ రెండు పాటలను నేర్చుకోకుండా ఏ గాయకుడూ ఉండడు. అయితే ఈ రెండు పాటలను పర్‌ఫెక్ట్‌గా పాడే సింగర్స్ తక్కువే అయినప్పటికీ అటెమ్ట్ చేయకుండా ఉండరు. ‘ఆడవే మయూరి’ పాట ఇప్పటికీ ఆదరణ పొందుతోంది అంటే దానికి సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన అందమైన సాహిత్యం, కె.వి.మహదేవన్ పాటను స్వర పరిచిన విధానం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అకుంఠిత దీక్షతో పాట పాడిన తీరు.. వెరసి ఒక అద్భుతం ఆవిష్కృతమైంది.
