Read more!

English | Telugu

నాని ఉంటేనే సినిమా చేస్తానన్న డైరెక్టర్!

సినీ పరిశ్రమలో యాక్టర్ గా అయినా, డైరెక్టర్ గా అయినా మొదటి అవకాశం రావడం అంత తేలిక కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరగాలి. అలాంటిది రాక రాక అవకాశమొస్తే.. తన ఫ్రెండ్ ని హీరోగా పెట్టుకుంటేనే సినిమా చేస్తాను అనే సాహసం కొత్త డైరెక్టర్ చేస్తారా?. నేచురల్ స్టార్ నాని కోసం డైరెక్టర్ నందిని రెడ్డి అలాంటి సాహసమే చేశారు.

నాని, నిత్యా మీనన్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అలా మొదలైంది'. కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ 2011 జనవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మొదలై పూర్తి కావడం వెనుక ఓ చిన్న పాటి యుద్ధమే జరిగింది.

2010-11 సమయంలో రొమాంటిక్ కామెడీ సినిమాల ట్రెండ్ లేదు. అందుకే నందిని రెడ్డి 'అలా మొదలైంది' కథ పట్టుకొని తిరుగుతుంటే నిర్మాతల రిజెక్ట్ చేసేవారు. అయితే స్వప్న దత్ మాత్రం ఈ కథ ఎంతగానో నచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మాత్రం వెనకడుగు వేశారు. కథలో కొన్ని మార్పులు చెప్పారు.

అప్పటికే నందిని రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్.. ఓ కొత్త నిర్మాత దామోదర ప్రసాద్ ను కలిసి కథ చెప్పమన్నారు. ఇదంతా జరిగే పని కాదని, అయిష్టంగానే వెళ్ళి కథ చెప్పారు నందిని. కథ విన్న దామోదర ప్రసాద్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు. దాంతో నందిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే హీరోగా ఎవరిని అనుకుంటున్నారని దామోదర ప్రసాద్ అడగగా.. నాని పేరు చెప్పారు నందిని. అప్పటికి నాని 'అష్టా చమ్మా', 'రైడ్', 'స్నేహితుడా' వంటి సినిమాలు చేసి ఉన్నారు. "నాని ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కి సెట్ అవుతాడా?" అని దామోదర ప్రసాద్ సందేహం వ్యక్తం చేయగా.. "నేను నా ఫ్రెండ్ నానిని ఊహించుకొనే ఈ కథ రాశాను. అతన్ని హీరోగా తీసుకుంటేనే సినిమా చేస్తాను" అని నందిని చెప్పేశారట. కథ నచ్చి, ఆమె కాన్ఫిడెన్స్ చూసి.. నానినే హీరోగా పెట్టి సినిమా చేశారు దామోదర ప్రసాద్.

కథలో ఎలాంటి మార్పులు చెప్పకుండా దామోదర ప్రసాద్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారని నందిని చెప్పడంతో.. స్వప్న దత్ ఎంతో సంతోషించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అలా మొదలైంది' కథను చాలా కొద్ది మాత్రమే నమ్మారు. షూటింగ్, ఎడిటింగ్ సమయంలో ఈ సినిమా ఆడదని చాలామంది డిస్కరేజ్ చేసేవారట. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ ఘన విజయం సాధించి కొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ తర్వాత 'అలా మొదలైంది' విషయంలో తన జడ్జ్ మెంట్ తప్పని తెలుసుకున్న అశ్వనీదత్.. నందినికి సారీ చెప్పడంతో పాటు, ప్రశంసించడం విశేషం.