Read more!

English | Telugu

'గోరింటాకు' సుజాత వ్య‌క్తిగ‌త జీవితంలో మీకు తెలీని నిజాలు!

 

క‌ళ్ల‌తోటే న‌టించే న‌టిగా సుజాత ద‌క్షిణాది సినీ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందారు. 1952 డిసెంబ‌ర్ 10న ఆమె జ‌న్మించారు. ఉద్యోగ రీత్యా తండ్రి శ్రీ‌లంక‌లోని గాలే ప‌ట్నంలో ప‌నిచేసేవారు. సుజాత అక్క‌డే పుట్టి పెరిగారు. తండ్రి రిటైర‌య్యాక శ్రీ‌లంక నుంచి చెన్నై వ‌చ్చి, అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. 14 ఏళ్ల వ‌య‌సులో సుజాత‌ సినిమాల్లో న‌టిగా అడుగుపెట్టారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమెను ప‌రిచ‌యం చేసింది ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు. శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన ఆ సినిమా 'గోరింటాకు'. అందులో ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రిచి, వారి అభిమాన తార‌గా మార్చేసింది. ఆమె న‌ట‌నా ప్ర‌తిభ‌ను ప్రపంచానికి చూపించింది కె. బాల‌చంద‌ర్ సినిమాలే. 'గుప్పెడు మ‌న‌సు' ఒక్క‌టి చాలు.. ఆమె ఏ స్థాయి న‌టో చెప్ప‌డానికి!

అప్ప‌టి అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు ప‌క్క‌న ఆమె హీరోయిన్‌గా న‌టించి, రాణించారు. త‌మిళంలో శివాజీ గ‌ణేశ‌న్‌, ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌ల‌కు జోడీగా చేశారు. ఆమె చివ‌ర‌గా న‌టించిన తెలుగు సినిమా నాగార్జున‌తో కె. రాఘ‌వేంద్రరావు రూపొందించిన 'శ్రీ‌రామ‌దాసు'. న‌టిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన సుజాత వ్య‌క్తిగ‌త జీవితం ఆనంద‌మయం కాదు. ఆమె భ‌ర్త పేరు జ‌య‌క‌ర్ హెన్రీ.. ఆయ‌న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏమీ చేయ‌కుండా ఇంట్లోనే ఉండి, సుజాత సంపాద‌న‌తో ద‌ర్జాగా బతికేవాడు.

సుజాత షూటింగ్ ముగించుకొని ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు, అన‌వ‌స‌రంగా నానా దుర్భాష‌లాడుతూ ఆమెను కొట్టేవాడ‌ని అప్ప‌ట్లో చెప్పుకునేవారు. ఒక్కోసారి నేరుగా సెట్స్‌కు వ‌చ్చి, నానా గొడ‌వా చేసేవాడంటారు. సుజాత కాల్షీట్ల కోసం ఎవ‌రైనా నిర్మాత‌లు కానీ, ద‌ర్శ‌కులు కానీ వ‌స్తే, వారికి ర‌క‌ర‌కాల కండిష‌న్లు పెట్టేవాడు. దాంతో సుజాత‌కు చాలా అవ‌కాశాలు మిస్స‌యిపోయేవి. నిజానికి వారిది ప్రేమ వివాహం కావ‌డం గ‌మ‌నార్హం. తాము అద్దెకు ఉండే ఇంటి య‌జ‌మాని కుమారుడైన జ‌య‌క‌ర్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ఇరువురి పెద్ద‌లూ అంగీక‌రించ‌లేదు. వారిని ఎదిరించి మ‌రీ దంప‌తులుగా మారారు.

వివాహానంత‌రం కొంత‌కాలం అమెరికాలో ఉన్నాక‌, తిరిగి ఇండియాకు వ‌చ్చేశారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, టాప్ హీరోల‌కు త‌ల్లిగా న‌టించారు. ఆ దంప‌తుల‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ప‌దేళ్ల క్రితం 2011లో ఏప్రిల్ 6న గుండెపోటుకు గురై మృతి చెందారు సుజాత‌.