Read more!

English | Telugu

"ఆకుచాటు పిందె త‌డిసే" పాట లిరిక్స్‌కు సెన్సార్ అభ్యంత‌రం!

 

న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు, శ్రీ‌దేవి జంట‌గా న‌టించిన 'వేట‌గాడు' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. కె. రాఘ‌వేంద్ర‌రావు నిర్దేశ‌క‌త్వంలో రోజా మూవీస్ బ్యాన‌ర్‌పై ఎం. అర్జున‌రాజు ఆ మూవీని నిర్మించారు. అందులోని ఓ సాంగ్ ఎవ‌ర్‌గ్రీన్ రెయిన్ సాంగ్స్‌లో ఒక‌టిగా పేరుపొందింది. ఆ పాట.. "ఆకుచాటు పిందె త‌డిసే". మ‌ద్రాస్‌లోని ఏవీఎం స్టూడియోలోని 5వ ఫ్లోర్‌లో ఎన్టీఆర్‌, శ్రీ‌దేవిపై ఆ పాట‌ను చిత్రీక‌రించారు. వాట‌ర్ స్ప్రింక్ల‌ర్స్‌ను ఉప‌యోగించి మూడు రోజుల్లో ఆ పాట తీశారు రాఘ‌వేంద్ర‌రావు.

'వేట‌గాడు' సినిమాలో ఈ రెయిన్ సాంగ్ హైలైట్ అయ్యింది. త‌ర్వాత వ‌చ్చిన వాన పాట‌ల‌కు ఈ సాంగ్ ఓ సిల‌బ‌స్‌గా నిలిచింది. శ్రీ‌దేవి అంద‌చందాలు, ఎన్టీఆర్ హుషారైన స్టెప్స్‌కు జ‌నం ఉర్రూత‌లూగిపోయారు. ఈ సినిమా సెన్సారింగ్‌కు వెళ్లిన‌ప్పుడు, రెయిన్ సాంగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేసిన సెన్సార్ మెంబ‌ర్స్‌, "ఆకుచాటు పిందె త‌డిసే" త‌ర్వాత వ‌చ్చే "కోక‌మాటు పిల్ల త‌డిసే"లో సౌండ్‌ను క‌ట్ చేయాలి లేదంటే మ‌రో మాట‌తో సౌండ్ రిప్లేస్ చేయాలి.. అని చెప్పారు. 

స‌రిగ్గా ఆ టైమ్‌లో ఏడిద నాగేశ్వ‌ర‌రావు ఆఫీసులో 'శంక‌రాభ‌ర‌ణం' సినిమాకు పాట‌లు రాస్తున్నారు వేటూరి. 'వేట‌గాడు' సాంగ్‌కు సెన్సార్ అభ్యంత‌రం విష‌యం క‌బురంద‌గానే, "సెన్సార్‌వాళ్లు నా పాట‌లో, జ‌య‌మాలిని ఆట‌లో క‌ట్‌లు చెప్ప‌కుండా ఉండ‌రు" అని న‌వ్వారు. ఐదు నిమిషాలు ఆలోచించి, "ఆకుచాటు పిందె త‌డిసే" త‌ర్వాత వ‌చ్చే "కోక‌మాటు పిల్ల త‌డిసే" మాట‌ల స్థానంలో "కొమ్మ‌చాటు పువ్వు త‌డిసే" అనే మాట‌ల‌ను రాసిచ్చి పంపారు.

అప్ప‌టిక‌ప్పుడు ఆ బిట్‌తో పాట‌ను రికార్డ్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి. అప్పుడు ఆ పాట‌కు మ‌రే అభ్యంత‌రం చెప్ప‌లేదు సెన్సార్‌వాళ్లు. 1979 జూలై 5న విడుద‌లైన 'వేట‌గాడు' దిగ్విజ‌యంగా ఆడ‌గా, "ఆకుచాటు పిందె త‌డిసే" సాంగ్‌కు జ‌నం పిచ్చెత్తిపోయారు.