English | Telugu

మ‌హాన‌టి భానుమ‌తి గురించి మీకు తెలీని నిజాలు!

మ‌హాన‌టి, గాయ‌ని, ద‌ర్శ‌కురాలు భానుమ‌తి త‌ల్లితండ్రులు బొమ్మ‌రాజు స‌ర‌స్వ‌త‌మ్మ‌, వెంక‌ట‌సుబ్బ‌య్య‌. చిన్న‌ప్ప‌ట్నుంచీ సంగీత సాహిత్యాల‌పై భానుమ‌తి ఆస‌క్తిని తండ్రి ప్రోత్స‌హిస్తూ వ‌స్తే, స‌దాచారాలు, సంప్ర‌దాయ‌ప‌ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పించారు త‌ల్లి. ఆమె సుప్ర‌సిద్ధ క‌వి గుర్రం జాషువా సోద‌రి హెడ్‌మిస్ట్రెస్‌గా ఉన్న స్కూల్లో చ‌దువుకున్నారు. తెలివైన విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నారు. తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు వ‌చ్చేస‌రికే సినీ రంగంలో ప్ర‌వేశించాల్సి వ‌చ్చింది. త‌ర్వాత 1966లో ప్రైవేటుగా మెట్రిక్ రాసి పాస‌య్యారు. 1967లో పీయూసీ పాస‌య్యారు.

వ‌ర‌విక్ర‌యం (1939) చిత్రం ద్వారా ఆమె న‌టిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. అందులో కాళింది పాత్ర చేశారు. "క‌ట్న‌మిచ్చి కొంటేగానీ, క‌న్నియ‌ల‌కు వ‌రుడే రాడూ.. క‌న్న‌వారికా కోతా, క‌న్నెజ‌న్మ‌మే రోతా.. స్వాతంత్ర‌మే లేదా" అని ఆ చిత్రంలో పాడారు. అంటే న‌టించిన‌ తొలి చిత్రంతోనే గాయ‌నిగానూ ఆమె ప‌రిచ‌య‌మ‌య్యారు.

భ‌ర‌ణీ పిక్చ‌ర్స్‌ను స్థాపించి ఆమె నిర్మించిన మొద‌టి చిత్రం 'ర‌త్న‌మాల' (1948). ఈ చిత్రానికి క‌థ వాళ్ల‌మ్మ బొమ్మ‌రాజు స‌ర‌స్వ‌త‌మ్మ స‌మ‌కూర్చారు. భానుమ‌తి భ‌ర్త రామ‌కృష్ణారావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ లేక‌పోయినా, స‌క్సెస్‌ఫుల్‌గా వంద రోజులు ఆడింది.

'చండీరాణి' (1952) చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌య్యారు భానుమ‌తి. ఆ చిత్రంలో ఆమె ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, రేలంగి, ఆర్‌. నాగేశ్వ‌ర‌రావు, హేమ‌ల‌త‌ లాంటి ఉద్ధండుల‌ను డైరెక్ట్ చేశారు. తెలుగు చిత్ర‌సీమ‌లో తొలిసారిగా ఒక మ‌హిళ ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేయ‌డం, అదీ మూడు భాష‌ల్లో.. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో.. చిత్రాన్ని రూపొందించ‌డం విశేషంగా చెప్పుకున్నారు. ఆ సినిమా షూటింగ్ చూడ‌డానికి సుప్ర‌సిద్ధ హిందీ న‌టుడు దిలీప్ కుమార్ త‌న మిత్రుల‌తో స‌త్యా స్టూడియోకు రావ‌డం ఇంకో విశేషం. మూడు భాష‌ల్లోనూ ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ సంద‌ర్భంగా వివిధ రంగాల్లో విశేష‌మైన కృషి చేసిన వారిని ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించింది. ప్ర‌సిద్ధులైన స్థానం న‌ర‌సింహారావు, గ‌డియారం సీతారామ‌శాస్త్రి, శ్రీ‌పాద సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి, ద్వారం వెంక‌ట‌స్వామినాయుడు లాంటి మ‌హానుభావుల స‌ర‌స‌న భానుమ‌తినీ స‌త్క‌రించారు.

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానం పొందిన ఎంజీఆర్‌తో భానుమ‌తి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఆమెను ఆయ‌నెప్పుడూ గౌర‌వ‌పూర్వ‌కంగా 'భానుమ‌తి అమ్మ‌యార్' అని పిలిచేవారు. ఆయ‌న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి అయ్యాక భానుమ‌తి మీద‌వున్న అభిమానంతో, గౌర‌వంతో ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల డైరెక్ట‌ర్‌, ప్రిన్సిపాల్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

ఎన్టీఆర్‌కూ, భానుమ‌తికీ మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో భ‌ర‌ణీ పిక్చ‌ర్స్ నిర్మించిన‌ 'వివాహ‌బంధం' ఒక‌టి. ఈ సినిమాలో న‌టిస్తుండ‌గానే క‌న్నాంబ కీర్తిశేషుల‌య్యారు. ఆ పాత్ర‌ను సూర్య‌కాంతంతో రిషూట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు భిన్నంగా రూపొందిన చిత్రాల్లో 'వివాహ‌బంధం' కూడా ఒక‌టి.