English | Telugu

ఎలా ప్రేమించాలో జ‌యంతికి నేర్పించిన కె. విశ్వ‌నాథ్‌!

ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన సూప‌ర్ హిట్ సినిమాల్లో 'సుమంగ‌ళి' (1965) ఒక‌టి. సావిత్రి టైటిల్ రోల్ చేసిన ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో కాగా, మ‌రో హీరోగా జ‌గ్గ‌య్య న‌టించారు. అందులో శోభ‌న్‌బాబుతో పాటు జ‌యంతి ఒక చిన్న పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆ సినిమాలో "ఓ ఫ‌స్ట్ నైట్ సీన్‌, అందులో ఓ సాంగ్ వ‌స్తుంది.. ఆ క్యారెక్ట‌ర్ చేస్తావా?" అని ఆదుర్తి అడిగితే, అంత పెద్ద ఆర్టిస్టులు చేస్తున్న సినిమా కాబట్టి స‌ర‌దాగా చేద్దామ‌నిపించి స‌రేనన్నారు జ‌యంతి.

ఫ‌స్ట్ నైట్ సీన్ కోసం జ‌యంతికి పెళ్లికూతురు అలంకారాలు చేశారు. మేడ‌పై ఆ సీన్ తీస్తున్నారు. సీన్ ప్ర‌కారం జ‌యంతి వ‌య్యారంగా నిల్చోవాలి. శోభ‌న్‌బాబు వ‌చ్చి ఆమె భుజంపై చేయి వేస్తారు. అప్పుడు ఆమె పుల‌క‌రించాలి. ఆ పుల‌క‌రించ‌డం ఏమిటో జ‌యంతికి తెలీలేదు. దాంతో క‌ట్ చెప్పారు ఆదుర్తి. ఆ సినిమాకు కె. విశ్వ‌నాథ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న జ‌యంతి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. "ఏయ్ బండ‌పిల్లా.. ఏమిట‌లా నిల్చుంటావ్‌! అబ్బాయి చేయి ఒంటిమీద ప‌డ‌గానే ఎలా పుల‌క‌రించాలి?" అన్నారు.

"నాకు తెలీలేదు సార్" అన్నారు జ‌యంతి.
"ప‌క్క‌కు త‌ప్పుకో.." అని చెప్పి, భుజంమీద అబ్బాయి చేయి ప‌డితే "హా.." అంటూ ఎలా పుల‌క‌రించాలో చేసి చూపించారు. వ‌య్యారంగా క‌ళ్లతో ఎలా చూడాలో చూపించారు. "ఇలా చూడాలి.. అంతే కానీ బండ‌బండ‌గా చూడ‌కూడ‌దు." అని చెప్పారు విశ్వ‌నాథ్‌.

ఆ ర‌కంగా ఒక్కొక్క షాట్‌కి ఎలా నిల్చోవాలో, ఎలా క‌ళ్లు పెట్టాలో, ఎలా మ‌త్తుగా చూడాలో జ‌యంతికి అన్నీ నేర్పారు. "చెప్పాలంటే నాకు ల‌వ్ ఎలా చెయ్యాలో నేర్పించింది కె. విశ్వ‌నాథ్ గారు" అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు జ‌యంతి. అలా సుమంగ‌ళిలో శోభ‌న్‌బాబుతో ఆమె ఫ‌స్ట్ నైట్ సీన్‌, "ఏవేవో చిలిపి త‌ల‌పులురుకుతున్న‌వి.." పాట‌ను చేశారు.