Read more!

English | Telugu

జ‌య‌ల‌లిత ఒక మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి, విడాకులు తీసుకున్నార‌ని మీకు తెలుసా?

 

చూడ‌గానే ఆక‌ట్టుకునే రూప‌లావ‌ణ్యాలు, అభిన‌య సామ‌ర్థ్యం ఎంత‌గా ఉన్నా, కాలం క‌లిసిరాక వ్యాంప్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయిన తార‌.. జ‌య‌ల‌లిత‌. ఒక‌ప్పుడు క్లాసిక‌ల్ డాన్స‌ర్స్ అయిన‌ చ‌ల్లా సిస్ట‌ర్స్ అంటే బాగా ఫేమ‌స్‌. ఆ ఇద్ద‌రు సిస్ట‌ర్స్‌లో ఒక‌రు జ‌య‌ల‌లిత‌! ఆమె ఒక మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను వివాహం చేసుకొని, త‌ర్వాత విడిపోయార‌నే విష‌యం చాలా మందికి తెలీదు. అవును. జ‌య‌ల‌లిత వినోద్ అనే మ‌ల‌యాళం డైరెక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. మ‌ల‌యాళంలో ఆయ‌న బిగ్రేడ్ మూవీస్ ఎక్కువ‌గా చేశాడు. ఆ సినిమాల్లో జ‌య‌ల‌లిత న‌టించారు. 

వినోద్ తండ్రి జ‌య‌దేవ‌న్ పేరుపొందిన ద‌ర్శ‌కుడు. ఆయ‌న సినిమాకూ,  డైరెక్ట‌ర్ క్రాస్‌బెల్ట్ మ‌ణి సినిమాకూ జ‌య‌ల‌లిత వాళ్ల నాన్న‌గారు ఒకే డేట్స్ ఇచ్చారు. ఆ విష‌యం జ‌య‌ల‌లిత‌కు తెలీదు. జ‌య‌దేవ‌న్ సినిమా షూటింగ్ సెట్స్ మీద జ‌య‌ల‌లిత ఉండ‌గా, క్రాస్‌బెల్ట్ మ‌ణి మ‌నుషులు వ‌చ్చి, "మీ నాన్న‌గారు మీ డేట్స్ మాకిచ్చారు. ఇక్క‌డ‌కు ఎలా వ‌స్తావు?" అంటూ రుబాబు చేయ‌బోయారు. వాళ్ల తీరు చూసి జ‌య‌ల‌లిత భ‌య‌ప‌డ్డారు. ఏం చేయాలో పాలుపోక ఆమె ఏడుస్తుంటే, హీరోలాగా వినోద్ అక్క‌డ‌కు వ‌చ్చి, "నేను నిన్ను కాపాడ‌తాను" అని ఆమెను ఒక రూమ్‌లో పెట్టి, క్రాస్ట్‌బెల్ట్ మ‌ణి మ‌నుషుల‌తో మాట్లాడి, వాళ్ల‌ను పంపించేశాడు. 

ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంతో ఆమె క‌ళ్ల‌కు వినోద్ పెద్ద హీరోలా క‌నిపించాడు. 'న‌న్ను కాపాడేవాడు జీవితాంతం ఇత‌నే' అని ఆమె ఫిక్స‌యిపోయారు. ఏడేళ్లు అత‌ని ప్రేమ‌లో మునిగితేలారు జ‌య‌ల‌లిత‌. 'అత‌ను దొంగ‌కోళ్లు ప‌ట్టుకొనేవాడిలా ఉన్నాడు. నిన్ను సేవ్ చేసేవాడిలా క‌నిపించ‌డం లేదు. జాగ్ర‌త్త.' అని మేక‌ప్‌మేన్‌-ప్రొడ్యూస‌ర్ జ‌య‌కృష్ణ‌, చ‌ల‌ప‌తిరావు లాంటి వాళ్లు చెప్పారు. ఆమె విన‌లేదు. ఆ టైమ్‌లో ఆమెకు ఎన్నో సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా, త‌నే ఫోన్ లిఫ్ట్‌చేసి, వేరే గొంతుతో "జ‌య‌ల‌లిత‌గారు లేరు. సినిమా షూటింగ్‌లో ఉన్నారు" అని అబ‌ద్ధం చెప్పి, ఆ అవ‌కాశాల్ని పోగొట్టుకున్నారు. వినోద్‌తో ఆమె చాలా ఇబ్బందులు ప‌డ్డారు. వేధింపులు ఎదుర్కొన్నారు. చివ‌ర‌కు ఆ బంధం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె, ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు.