English | Telugu

న‌డుము గిల్లిన ఆక‌తాయిని చెంప ఛెళ్లుమ‌నిపించిన ల‌తాశ్రీ‌!

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకొని, చాలా సినిమాల్లో హీరో చెల్లెలిగా, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా న‌టించిన ల‌తాశ్రీ గుర్తున్నారా? 'య‌మ‌లీల' సినిమాలో య‌ముడిగా న‌టించిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ఐస్‌క్రీములు తినిపిస్తూ, ఆయ‌న‌తో ఓ డ్యూయెట్ కూడా చేసి ప్రేక్ష‌కుల్ని అల‌రించారు ల‌తాశ్రీ‌. అలాంటి ఆమెను ఓ సంద‌ర్భంలో ఓ ఆక‌తాయి అల్ల‌రి చేశాడు. ఆ క‌థేమిటంటే...

సీనియ‌ర్ న‌రేశ్, సీత జంట‌గా న‌టించిన 'పోలీస్ భార్య' (1990) చిత్రంలో ల‌తాశ్రీ ఓ కీల‌క పాత్ర చేశారు. రేలంగి న‌ర‌సింహారావు డైరెక్ట్ చేసిన ఆ ఫిల్మ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, వంద రోజులు ఆడింది. ఆ సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుక స‌భ‌ జ‌రిగిన‌ప్పుడు దానికి ల‌తాశ్రీ హాజ‌ర‌య్యారు. ఆ వేడుక‌కు వేలాది మంది జ‌నం వ‌చ్చారు. వేడుక ముగిశాక ఆర్టిస్టులంద‌రూ స్టేజి మీద‌నుంచి కింద‌కు దిగి వ‌స్తున్నారు. ముందు న‌రేశ్‌, ఆ వెనుక సీత‌, ల‌తాశ్రీ‌, మిగ‌తా ఆర్టిస్టులు న‌డుస్తున్నారు.

హ‌ఠాత్తుగా ఆడియెన్స్‌లోంచి ఒక ఆక‌తాయి వెనుక నుంచి ల‌తాశ్రీ న‌డుము ప‌ట్టుకుని గిల్లాడు. ఉలిక్కిప‌డి చూశారు ల‌తాశ్రీ‌. అత‌ను రెండోసారి గిల్ల‌డానికి వ‌స్తున్నాడు. పిచ్చికోపం వ‌చ్చేసిందామెకు. ఠ‌క్కున అత‌ని చేయిప‌ట్టుకొని మెలితిప్పి, చెంప ఛెళ్లుమ‌నిపించారు ల‌తాశ్రీ‌. అది చూసి, ప‌ది మందికి పైగా ఉన్న వాడి గ్యాంగ్ అక్క‌డ‌కు వ‌చ్చేశారు. ఏంటి మావాడ్ని కొడుతున్నార‌ని మీద మీద‌కు వ‌చ్చారు.

అప్పుడు ల‌తాశ్రీ పాలిట న‌రేశ్ రియ‌ల్ హీరో అయ్యారు. ఆ గ్యాంగ్‌తో గ‌ట్టిగా మాట్లాడి, అక్క‌డున్న‌ పోలీసుల‌ను పిలిపించి, వాళ్ల‌ను అక్క‌డ్నుంచి పంపించేశారు. ల‌తాశ్రీ జోలికి మ‌ళ్లీ ఎవ‌రూ రాకుండా తాను ర‌క్ష‌ణ‌గా ఉండి, వ్యాన్‌లో ఎక్కించారు న‌రేశ్‌. 30 ఏళ్ల క్రితం జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌ను ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేదు ల‌తాశ్రీ‌.