English | Telugu

జ‌నాన్ని న‌వ్వించ‌లేక‌పోయిన బ్ర‌హ్మానందం!

బ్ర‌హ్మానందం సినీ ఫీల్డులోకి రాక‌ముందు అత్తిలి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌టికే ఆయ‌న ఎన్నో ఏళ్లుగా మిమిక్రీ చేస్తూ, మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. ఓసారి ఆ ఊళ్లోనే బ్ర‌హ్మానందం ఓ సంద‌ర్భంలో మిమిక్రీ ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఆయ‌న మిమిక్రీ చేస్తుంటే జ‌నం విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు. విప‌రీతంగా ఆనందిస్తున్నారు. వాళ్లు అలా న‌వ్వుతుంటే ఆయ‌న‌లో ఉత్సాహం మ‌రింత ఎక్కువై, వాళ్ల‌ను మ‌రీ మ‌రీ న‌వ్విస్తున్నారు. ఆ ప్ర‌దేశ‌మంతా న‌వ్వుల‌మ‌యం అయిపోయింది.

అంత‌లోనే ఓ విచిత్రం జ‌రిగింది. ఆ ఊరి ప్రెసిడెంట్ అక్క‌డికి వ‌చ్చి జ‌నాన్ని ఉద్దేశించి, "ఆపండి" అని కేక వేశాడు. జ‌నం న‌వ్వ‌డం ఆపేశారు. బ్ర‌హ్మానందం ప్రోగ్రామ్ ఆపేశారు. సూది నేలమీద వేస్తే ఆ చ‌ప్పుడు అంద‌రికీ వినిపించేంత నిశ్శ‌బ్దం ఆవ‌రించింది. బ్ర‌హ్మానందంకు ఏమీ అర్థం కాలేదు. ఏమిటా అని చూసేస‌రికి ప్రెసిడెంట్ గొంతు వినిపించింది.

"మీరంతా ఎందుకు న‌వ్వుతున్నారు? అస‌లు మీకెందుకు న‌వ్వొస్తుంది? ఆయ‌నెవ‌ర‌నుకున్నారు.. మ‌న‌వూరి కాలేజీ తెలుగు లెక్చ‌ర‌ర్‌. ఆయ‌న్ని చూస్తే మీకు న‌వ్వులాట‌గా ఉందా? ఇంకెప్పుడు ఇలా న‌వ్వ‌కండి. ఈసారి కానీ మీలో ఎవ‌రు న‌వ్వినా చంపేస్తాను" అని గ‌ద్దించి, బ్ర‌హ్మానందంను చూసి, "మీరు ప్రోగ్రాం కానివ్వండి మాస్టారూ" అన్నాడు.

బ్ర‌హ్మానందం మ‌ళ్లీ మిమిక్రీ కొన‌సాగించారు. ఆయ‌న వాళ్ల‌ను న‌వ్వించ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించినా వాళ్ల ముఖాల్లో న‌వ్వు క‌నిపించ‌డం లేదు. వాళ్లు న‌వ్వ‌కుండా ఉండ‌టంతో ఆయ‌న‌లో ప‌ట్టుద‌ల ఎక్కువై వాళ్ల‌ను న‌వ్వించ‌డానికి క‌ష్ట‌ప‌డి ఎన్నో ర‌కాలుగా మిమిక్రీ చేశారు. వాళ్ల‌కి న‌వ్వు వ‌స్తున్నా లోలోనే దిగ‌మింగి, నోరు మూసుకొని కూర్చున్నారే కానీ ఒక్క‌రూ పైకి న‌వ్వ‌లేదు. ఎన్నోసార్లు, ఎన్నో మిమిక్రీ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చి ఎంద‌రెంద‌రినో బ్ర‌హ్మానందం న‌వ్వించారు. కానీ అప్పుడు వాళ్ల‌ను మాత్రం న‌వ్వించ‌లేక‌పోయారు. ఈ త‌మాషా సంఘ‌ట‌న గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బ్ర‌హ్మానందం న‌వ్వుకుంటూ ఉంటారు.