Read more!

English | Telugu

కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించింది ఈ సినిమాలోనే!

 

'అల్లూరి సీతారామ‌రాజు' (1974) సినిమా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఎంత‌టి పేరు తెచ్చిందో, ఆయ‌న కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాయిగా ఎలా నిలిచిందో మ‌న‌కు తెలుసు. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన మ‌న్యంవీరుడు సీతారామ‌రాజు పాత్ర‌లో కృష్ణ అద్భుతాభిన‌యం అశేష ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకొని, ఆయ‌న అభిమాన గ‌ణాన్ని ఎన్నో రెట్లు పెంచింది. అయితే సీతారామ‌రాజు పాత్ర‌ను ఆ సినిమాలో కంటే ఆరేళ్ల ముందుగానే మ‌రో సినిమాలో కృష్ణ పోషించారు. అది.. 'అసాధ్యుడు' (1968) సినిమా. హీరోగా మారిన మూడేళ్ల‌కు చేసిన ఆ సినిమాలో ఓ నృత్య రూప‌కంగా సీతారామ‌రాజు క‌థ వ‌స్తుంది.

సుప్ర‌సిద్ధ రంగ‌స్థ‌ల‌, సినీ న‌టుడు వ‌ల్లం న‌ర‌సింహారావు ప్ర‌ద‌ర్శించే 'అల్లూరి సీతారామ‌రాజు' నాట‌కం చూసి, ఉత్తేజితులైన కృష్ణ.. ఎలాగైనా ఆ పాత్ర పోషించాల‌ని త‌పించేవారు. 'అసాధ్యుడు' చిత్ర నిర్మాత, ప‌హిల్వాన్ అయిన నెల్లూరు కాంతారావు ద‌ర్శ‌కుడు వి. రామ‌చంద్ర‌రావుతో చ‌ర్చించి సినిమాలో సీతారామ‌రాజుకు సంబంధించిన ఒక ఎపిసోడ్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. సంగీత ద‌ర్శ‌కుడు టి. చ‌ల‌ప‌తిరావుతో త‌మ ఆలోచ‌న చెప్పారు. పాట రూపంలో సీతారామ‌రాజు క‌థ చెబితే బాగుంటుందని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.

ఆ పాట రాసే బాధ్య‌త‌ను మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌కి అప్ప‌గించారు. "తెల్ల‌దొర‌ల గుండెల‌ల్ల ఝ‌ల్లుమ‌నంగా" అంటూ ఉద్వేగ‌భ‌రితంగా సాగే పాట‌ను రాసిచ్చారు శ్రీ‌శ్రీ‌. చ‌ల‌ప‌తిరావు ట్యూన్ క‌ట్టిన ఆ ఏడు నిమిషాల పాట‌ను బి. గోపాలం, వ‌సంత బృందం ఆల‌పించారు. వ‌ల్లం న‌ర‌సింహారావు వ్యాఖ్యానం అందించ‌గా నృత్య రూప‌కంగా దాన్ని మ‌ల‌చారు. ఆ రూప‌కం చిత్రీక‌ర‌ణ‌కు ప‌ది రోజుల స‌మ‌యం ప‌ట్టింది. వేణుగోపాల్ కొరియోగ్ర‌ఫీ అందించిన ఆ రూప‌కం 'అసాధ్యుడు' చిత్రం మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. సీతారామ‌రాజుగా కృష్ణ ఆహార్యం ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. రూథ‌ర్‌ఫ‌ర్డ్‌గా ప్ర‌భాక‌ర్‌రెడ్డి న‌టించ‌గా, గిరిజ‌న యువ‌తిగా వాణిశ్రీ క‌నిపించారు. అనంత‌ర కాలంలో గొప్ప సినిమాటోగ్రాఫ‌ర్‌గా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఆర్జించిన వి.ఎస్‌.ఆర్‌. స్వామికి ఇది తొలి సినిమా. ఆయ‌న ప్ర‌తిభా సామ‌ర్థ్యాలు ఎలాంటివో తొలి సినిమాలోనే మనం చూడొచ్చు.

విశేష‌మేమంటే 'అల్లూరి సీతారామ‌రాజు' సినిమాకూ ఆయ‌నే సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం. అలాగే 'అసాధ్యుడు'లో సీతారామ‌రాజు నృత్య రూప‌కాన్ని రాసిన శ్రీ‌శ్రీ 'అల్లూరి సీతారామ‌రాజు'లో రాసిన "తెలుగువీర లేవ‌రా" పాట‌కు ఉత్త‌మ గీత‌ర‌చ‌యిత‌గా జాతీయ అవార్డును అందుకున్నారు. 'అసాధ్యుడు' ద‌ర్శ‌కుడైన రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలోనే 'అల్లూరి సీతారామ‌రాజు' మొద‌లైంది. అయితే మ‌ధ్య‌లో ఆయ‌న ఆక‌స్మికంగా మృతి చెందడంతో కె.ఎస్‌.ఆర్‌. దాస్ స‌హ‌కారంతో తానే ఈ సినిమాను పూర్తి చేశారు కృష్ణ‌. అయితే రామ‌చంద్ర‌రావు మీద గౌర‌వంతో టైటిల్స్‌లో ఆయ‌న పేరే వేశారు.

(ఈరోజు అల్లూరి సీతారామ‌రాజు జ‌యంతి)