Read more!

English | Telugu

ఎన్టీఆర్ 'రాముడు-భీముడు' క‌థ‌ను మొద‌ట ఏఎన్నార్ రిజెక్ట్ చేశారు!

 

న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు ద్విపాత్రాభిన‌యం చేసిన‌ 'రాముడు-భీముడు' చిత్రం 1964లో రిలీజై ఘ‌న విజ‌యం సాధించిన‌. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం అదే. నిజానికి రామారావు కంటే ముందు ఆ స్క్రిప్టు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. కథ న‌చ్చి కూడా ఆయ‌న దాన్ని రిజెక్ట్ చేశారు. దానికి ఓ కార‌ణం ఉంది.

నిజానికి 'రాముడు-భీముడు' క‌థ‌ను మొద‌ట జాన‌ప‌ద క‌థ‌గా రాశారు ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు. 'ప్రిజ‌న‌ర్ ఆఫ్ జెండా' ఇనే ఇంగ్లిష్ న‌వ‌ల‌, వేదం వేంక‌ట‌రాయ‌శాస్త్రి ర‌చించిన 'ప్ర‌తాప‌రుద్రీయం' నాట‌కం.. రెండింటినీ క‌లిపి ఆయ‌న ఒక జాన‌ప‌ద క‌థ అల్లారు. అయితే అదే స‌మ‌యంలో త‌మిళంలో ఎంజీ రామ‌చంద్ర‌న్‌, భానుమ‌తి, బి. స‌రోజాదేవి కాంబినేష‌న్‌లో 'నాడోడి మ‌ణ్ణ‌న్' అనే జాన‌ప‌ద సినిమా వ‌చ్చింది. అందులో ఎంజీఆర్ అన్న‌ద‌మ్ములుగా డ్యూయ‌ల్ రోల్ చేశారు.

ఆ టైమ్‌లో 'ది స్కేప్ గోట్' అనే న‌వ‌ల చ‌దివిన న‌ర‌స‌రాజుకు 'రాముడు-భీముడు' క‌థ‌ను సాంఘికంగా మార్చాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. మూడు నాలుగు వారాల్లో పూర్తి స్క్రిప్టు రాసేశారు. దాన్ని క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు డైరెక్ష‌న్‌లో మిద్దే జ‌గ‌న్నాథ‌రావు నిర్మించాల‌నేది ప్లాన్‌. ఆ క‌థ‌ను అక్కినేనితో తియ్యాల‌ని జ‌గ‌న్నాథ‌రావు అనుకున్నారు. ఎందుకంటే అంత‌కుముందే ఆయన నిర్మించిన 'రాజ‌నందిని' సినిమాలో ఎన్టీఆర్ హీరోగా న‌టించారు. ఆయ‌న సూచ‌న మేర‌కు అక్కినేనికి ఆ క‌థ వినిపించారు న‌ర‌స‌రాజు.

'రాముడు-భీముడు' క‌థ ఏఎన్నార్‌కు బాగా న‌చ్చింది. కానీ ఆయ‌న న‌ర‌స‌రాజుతో, "ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్ప‌ట్లో జ‌గ‌న్నాథ‌రావుకు కాల్షీట్లు ఇవ్వ‌లేను. అదీగాక మ‌రికొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాలో నేనే న‌టించ‌లేను. నాకు క‌థ న‌చ్చ‌లేదు అని వారికి  చెప్తాను. మీరేమీ అనుకోవ‌ద్దు. నిజానికి క‌థ నాకు బాగా న‌చ్చింది. ఈ విష‌యంలో మీరు నాకు స‌హ‌క‌రించాలి" అని చెప్పారు. అలా ఆ ప్రాజెక్టు అట‌క ఎక్కింది.

ఆ త‌ర్వాత సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌ను ప్రారంభించిన డి. రామానాయుడు, దానిపై తొలి చిత్రాన్ని తాపీ చాణ‌క్య ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌ని సంక‌ల్పించారు. మ‌ద్రాస్ మెరీనా బీచ్‌లో ఆ ఇద్ద‌రికీ క‌థ చెప్పారు న‌ర‌స‌రాజు. వారికి న‌చ్చింది. మ‌రుస‌టి రోజు ఎన్టీ రామారావు ఇంట్లో ఆయ‌న‌కు క‌థ వినిపించారు. వెంట‌నే ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అలా అన్న‌ద‌మ్ములుగా రామారావు డ్యూయ‌ల్ రోల్ చేసిన 'రాముడు-భీముడు' థియేట‌ర్ల‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ట‌యి, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌కు ఘ‌న‌మైన ఆరంభాన్నిచ్చింది.