English | Telugu
శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ను కమల్ హాసన్ ఎందుకు తిరస్కరించాడు?
Updated : Apr 7, 2021
కమల్ హాసన్, శ్రీదేవి హిట్ పెయిర్‌గా వెండితెరను ఏలారు. వారి జోడీ ప్రేక్షకులకు కన్నుల పంట. 'వసంత కోకిల'లో ఆ ఇద్దరి నటన చూసి ఉద్వేగం చెందని వారెవరు? 'ఆకలి రాజ్యం', 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' సినిమాల్లో వారి రొమాన్స్ చూసి ముచ్చటపడని వాళ్లెవరు? ఇక తమిళంలో అయితే మరిన్ని సినిమాలు జంటగా చేసి, ప్రేక్షకుల్ని అలరించారు. హిందీలోనూ 'సద్మా' లాంటి సినిమాలు చేశారు. దాంతో ఆ ఇద్దరూ నిజ జీవితంలోనూ జంట అయితే ఎంత బాగుంటుందోనని అప్పటి వారి ఫ్యాన్స్ ఆశించారు. పైగా శ్రీదేవి కుటుంబంతో కమల్ చాలా సన్నిహితంగా మెలగేవాడు. అందుకే ఆమెను పెళ్లిచేసుకొమ్మని స్వయంగా శ్రీదేవి తల్లి కమల్‌ను అడిగారనే విషయం మీకు తెలుసా?
చాలా మంది షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ, ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా కమల్ వెల్లడించారు. శ్రీదేవి కన్నుమూశాక, ఆమెకు నివాళి అర్పించేందుకు ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్‌లో 'శ్రీదేవి 28 అవతారాలు' అనే టైటిల్‌తో రాసిన ఓ నోట్‌ను ప్రెజెంట్ చేశారు కమల్. అందులో ఆ విషయం కూడా ఉంది.
శ్రీదేవి, కమల్ చాలా సన్నిహితంగా మెలగుతుండటంతో శ్రీదేవి తల్లికి కూడా ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకే తన కూతుర్ని పెళ్లి చేసుకొమ్మని ఆమె అడిగారు. కానీ కమల్ ఆమె ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఎందుకంటే శ్రీదేవిని తన తోబుట్టువులా భావించేవాడిననీ, అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేనని చెప్పాననీ కమల్ వెల్లడించారు.
తెరపై శ్రీదేవితో తాను పలు లవ్ సీన్స్‌లో నటించినందువల్ల తమ అభిమానులు నిజ జీవితంలోనూ తమ మధ్య అలాంటి అనుబంధం ఉండేదని ఊహించుకొనేవారని ఆయన చెప్పారు. అయితే ఇలాంటి రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టడానికి తానెప్పుడూ ప్రయత్నిస్తూ వచ్చానని తెలిపారు.
నిజానికి తానంటే శ్రీదేవికి చాలా గౌరవమనీ, తను మృతి చెందేదాకా కూడా తనను సార్ అంటూ పిలిచేదనీ కమల్ గుర్తు చేసుకున్నారు. దీన్ని బట్టి కమల్, శ్రీదేవి మధ్య బంధం ఎంత స్వచ్ఛంగా ఉండేదో అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పటికీ తెరపై ఆ ఇద్దరినీ చూడ్డం మనకు కన్నుల పంటే!