Read more!

English | Telugu

ముఖ్యమంత్రి చేత కన్నీళ్లు పెట్టించిన సూర్యకాంతం

మనం ఎంత ఎదిగినా మనకి అన్నం పెట్టినవారిని, ఆప్యాయతను పంచినవారిని ఎప్పటికీ మరిచిపోకూడదు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితది కూడా అలాంటి మనస్తత్వమే.

అది 1994వ సంవత్సరం.. తేదీ డిసెంబర్ 18.
అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన విదేశీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుంది. 

ఇంతలో ముఖ్యమంత్రి  కార్యదర్శి వచ్చి జయలలిత చెవిలో చిన్నగా ఏదో చెప్పారు. ఆ మాట వినగానే ఆమె లేచి నిలబడి విదేశీ ప్రతినిధులకి నమస్కరించి.. "ఒక ముఖ్యమైన వ్యక్తిగత విషయంపై బయటకు వెళ్తున్నాను. మరో 45 నిముషాల్లో వస్తాను. ఈ లోగా మీరు మా ఆతిధ్యాన్ని  స్వీకరించండి" అని చెప్పి వేగంగా వెళ్ళి కారు ఎక్కారు.

కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే కొంతమంది అక్కడ వున్నారు. జయలలిత కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు. ఎదురుగా శవపేటిక ఉంది. చేతులు జోడించి శవపేటిక చుట్టూ మూడు సార్లు తిరిగారు. సెక్రటరీ అందించిన పుష్పగుచ్ఛాన్ని అక్కడ ఉంచి, నమస్కారం చేశారు. ఆమె కంటి నుంచి కారుతున్న కన్నీటిని తుడుచుకున్నారు. జయలలితను అలా చూసి సెక్రటరీ నివ్వెరపోయాడు. ఆమె జీవితం లో ఎన్నో కష్టాలను, ఘోర అవమానాలను చూశారు. ఎన్ని ఎదురైనా శిఖరంలా నిలబడ్డారు కానీ ఎప్పుడు కన్నీరు పెట్టింది లేదు. అలాంటిది ఆమె మొదటిసారి కంటతడి పెట్టుకున్నారు.

కారు ఆ ఇంటి నుండి తిరిగి బయల్దేరింది. జయలలిత మొదటిసారి కంటతడి పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయిన సెక్రటరీ.. "ఆమె ఎవరు మేడం?" అని అడిగాడు.

"ప్రేమగా, ఆప్యాయంతో అన్నం పెట్టి, ఆకలి తీర్చిన అమ్మ సూర్యకాంతమ్మ.. ఒక మహా నటి" అంటూ అంత బాధలోనూ గర్వంతో చెప్పారు జయలలిత.

సెక్రటరీ మరింత ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 

సూర్యకాంతం గురించి జయలలిత మరింత గర్వంగా చెప్పడం మొదలుపెట్టారు.

"సినిమా షూటింగ్ కు వచ్చినప్పుడు రకరకాల వంటలు చేసి, కారియర్ లో తెచ్చి సహనటులందరికీ కొసరి కొసరి వడ్డించి, తినిపించేవారు. ఆమె చేసిన పులిహార, మసాల వడలు అంటే నాకు చాలా ఇష్టం. స్టూడియోలో ఆమె షూటింగ్ జరుగుతుందని తెలిస్తే చాలు, వేరే ఫ్లోర్ లో పనిచేస్తున్న నేను భోజనానికి ఆమె దగ్గర వెళ్ళేదానిని. మా అమ్మ తరువాత అమ్మ వంటిది" అని జయలలిత చెప్పారు.

సూర్యకాంతం అంటే తెరపై గయ్యాళి అత్తగానే ప్రేక్షకులకు తెలుసు. కానీ తెర వెనక ఒక అమ్మలా ఆమె చూపే ప్రేమ గురించి, ఆమె గొప్ప మనసు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అలా తెలిసిన వారిలో జయలలిత ఒకరు.

సూర్యకాంతం ఎంత గొప్పవారో.. ఆమె పంచిన ప్రేమను గుర్తుపెట్టుకొని ఆమెని అమ్మగా భావించిన జయలలిత కూడా అంతే గొప్పవారు. ఆమెది అంత గొప్ప మనసు కాబట్టేనేమో.. తమిళ ప్రజలు ఆమెను అమ్మా  అని ఆప్యాయంగా పిలిచేవారు.