Read more!

English | Telugu

చిన్న‌న‌టి మంజుభార్గ‌విని 'శంక‌రాభ‌ర‌ణం' హీరోయిన్‌గా కె. విశ్వ‌నాథ్ ఎలా తీసుకున్నారు?

 

మంజుభార్గ‌వి సుప్ర‌సిద్ధ నాట్య‌కార‌ణి. కూచిపూడిలో వెంప‌టి చినస‌త్యం మాస్టారు ఆమె గురువు. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ కె. విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేసిన క్లాసిక్ ఫిల్మ్ 'శంక‌రాభ‌ర‌ణం'లో హీరోయిన్ తుల‌సి పాత్ర మంజుభార్గ‌వి న‌ట జీవితంలో మైలురాయిగా, ఒక క‌లికితురాయిలా నిలిచిపోయింది. అయితే ఆ సినిమాకు ముందు ఆమె కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు.. ఆమె మాట‌ల్లోనే చెప్పాలంటే పిచ్చి పిచ్చి వేషాలు వేశారు. అలాంటి ఆమెకు ఏకంగా 'శంక‌రాభ‌ర‌ణం' లాంటి సినిమాలో నాయిక‌గా అవ‌కాశం రావ‌డం అంటే మాట‌లు కాదు. అదెలా సాధ్య‌మైంది?  విశ్వ‌నాథ్ ఆమెనే ఎందుకు తుల‌సి పాత్ర‌కు ఎంచుకున్నారు?

చెన్నైలో ఒక‌సారి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ వారు ఏదో ఒక ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. ఆ ఫంక్ష‌న్‌లో గీత‌, మంజుభార్గ‌వి, మ‌రో న‌టి.. ముగ్గురిని వాకిట్లో నిల్చొని వ‌చ్చిన అతిథులంద‌రి మీదా ప‌న్నీరు చ‌ల్లి, వారికి పూలు ఇవ్వమ‌ని చెప్పారు. ఆ వ‌చ్చిన అతిథుల్లో విశ్వ‌నాథ్ కూడా ఉన్నారు. అప్ప‌టికే 'శంక‌రాభ‌ర‌ణం' క‌థ మీద ప‌నిచేస్తున్న ఆయ‌న‌ మంజుభార్గ‌విని చూడ‌గానే ఆయ‌నకు తుల‌సి పాత్ర‌ధారిణి దొరికేసింద‌ని అనిపించింది. Also read: ​25 వేల కోసం 15 కిలోల వెండిని తాక‌ట్టు పెట్టిన డైరెక్ట‌ర్‌!

అయితే ఆమె ఆ పాత్ర‌కు స‌రిపోతుందో, లేదో తెలియాలి క‌దా! అందుక‌ని 'శంకరాభ‌ర‌ణం' కంటే ముందు తీసిన 'ప్రెసిడెంట్ పేర‌మ్మ' మూవీలో మంజుభార్గ‌వి చేత ఓ జావ‌ళి చేయించారు. ఆ సినిమాలో నూత‌న్‌ప్ర‌సాద్‌, క‌విత హీరో హీరోయిన్లు. స్టేజి మీద ఎలా చేస్తారో అలా మేక‌ప్‌, కాస్ట్యూమ్స్‌, ఆభ‌ర‌ణాలు ధ‌రింప‌జేసి అలా మంజుభార్గ‌వి చేత‌ చేయించారు. అలాగే రెండు సీన్లు కూడా ఆమెకు పెట్టారు. బ‌హుశా ఆమె ప‌ర్ఫార్మెన్స్‌ను చూసేదానికేమో! డ‌బ్బింగ్ కూడా ఆమెచేతే చెప్పించారు. అంత‌దాకా ఆమె త‌ను చేసిన ఏ సినిమాకీ డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. కార‌ణం.. ఆమెది బేస్ వాయిస్‌! ద‌గ్గ‌రుండి మంజుభార్గ‌వి చేత డ‌బ్బింగ్ చెప్పించారు విశ్వ‌నాథ్‌. ఆ డ‌బ్బింగ్ అయిపోయాక "నీ ఫొటో ఒక‌టి కావాలి" అన్నారాయ‌న‌. Also read: ​సింగ‌ర్ రాజ్ సీతారామ్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ ఎందుకు ఎంక‌రేజ్ చేశారు?

స‌రేన‌ని చెప్పి, బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ సంగ‌తి మ‌ర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు మంజుభార్గ‌వి. నెల రోజులు గ‌డిచాక 'శంక‌రాభ‌ర‌ణం' యూనిట్ నుంచి ఎవ‌రో వ‌చ్చి ఫొటో కావాల‌ని అడిగారు. అప్పుడు పాండీబ‌జార్‌లోకి కృష్ణా ఫొటో స్టూడియోకు వెళ్లి లాంగ్‌షాట్‌, క్లోజ‌ప్‌, ప్రొఫైల్ ఫొటోలు తీయించుకొని అవి ఇచ్చారు. ఆ త‌ర్వాత జె.వి. సోమ‌యాజులు, మంజుభార్గ‌వికి క‌లిపి మేక‌ప్ టెస్ట్ చేయించారు విశ్వ‌నాథ్‌. అప్పుడు తీసిన ఫొటోల‌ను ఇండ‌స్ట్రీలో ప‌లువురికి చూపించారు. అప్ప‌టికే కొన్ని సినిమాల్లో ఏవేవో రోల్స్ చేసిన మంజుభార్గ‌విని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు.

అలా 'శంక‌రాభ‌ర‌ణం' చిత్రంలో నాయిక‌గా అడుగుపెట్టారామె. ఆ సినిమా ఆమెకు ఎంత‌టి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా త‌ర్వాత ఆమె సినిమా వేషాల మీద కంటే త‌న మ‌న‌సుకు ఇష్ట‌మైన‌ డాన్స్ ప్రోగ్రామ్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా త‌క్కువ సినిమాలు చేశారు.

(ఫిబ్ర‌వ‌రి 19 కె. విశ్వ‌నాథ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా...)