English | Telugu

పోలీస్‌ జీపులో షూటింగ్‌కి వచ్చిన బాలయ్య.. షాక్‌ అయిన యూనిట్‌.!

కొందరు హీరోలు తాము చేసే పాత్ర విషయంలో ఎంతో కేర్‌ తీసుకుంటారు. ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యేందుకు కృషి చేస్తారు. సినిమా జరుగుతున్నన్ని రోజులూ అదే ట్రాన్స్‌లో ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌, లారీ డ్రైవర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌లో బాలకృష్ణ క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు బాలకృష్ణకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చి టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలలో ఒకడిగా నిలబెట్టాయి. బాలకృష్ణ క్యారెక్టర్‌ను ఎలా డిజైన్‌ చేస్తే ఆడియన్స్‌కి నచ్చుతుందో గోపాల్‌కి తెలుసు. అలాగే ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి ఏ రేంజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వాలో బాలకృష్ణకు తెలుసు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండిరగ్‌తో చేసిన ఆ సినిమాలన్నీ అంతటి ఘనవిజయం సాధించాయంటే దాని వెనుక బాలకృష్ణ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

1992లో నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ అప్పట్లో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలోని ఇన్‌స్పెక్టర్‌ క్యారెక్టర్‌కి బాలకృష్ణ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్‌ అలా రావడం వెనుక ఎంతో హోమ్‌ వర్క్‌ ఉంది. నిజమైన పోలీసులు ఎలా నడుస్తారు, వారి బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది వంటి విషయాలను సునిశితంగా పరిశీలించేవారు బాలకృష్ణ. జీపులో కూర్చొని వెళుతున్నప్పుడు వారి స్టైల్‌ ఎలా ఉంటుంది అనే దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. వీటన్నింటిపైనా కమాండ్‌ వచ్చిన తర్వాత ఒకరోజు బి.గోపాల్‌కి ఫోన్‌ చేసి తాను షూటింగ్‌కి రావాలంటే జీపు పంపించాలని చెప్పారు. దానికి గోపాల్‌ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య ఈరోజు జీపు ఎందుకు పంపించమన్నాడు అనే విషయం అతనికి అర్థం కాలేదు. బాలయ్య చెప్పినట్టుగానే జీపు పంపించారు. పోలీస్‌ యూనిఫామ్‌ వేసుకొని ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్న బాలయ్య.. జీపు రాగానే అందులోకి ఎక్కి ఒక కాలు బయటపెట్టి స్టైల్‌గా లాఠీ ఊపుతూ కూర్చున్నారు. ఓపెన్‌గా అందరికీ కనిపించేలా జీపులో సెట్స్‌కి వచ్చారు.

ఆరోజుల్లో వచ్చిన పోలీస్‌ స్టోరీస్‌ సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన సినిమా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. ఈ సినిమా అంత పెద్ద హిట్‌ అవ్వడానికి బాలకృష్ణ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు కూడా కారణమయ్యాయి. పోలీస్‌ యూనిఫామ్‌లో బాలకృష్ణను చూసి అభిమానులు మురిసిపోయారు. ఇన్‌స్పెక్టర్‌గా బాలకృష్ణ తన పవర్‌ఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశారు. తను చేసే ప్రతి క్యారెక్టర్‌ని ఓన్‌ చేసుకుని నటించే బాలయ్య.. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ అలా పోలీస్‌ జీపులో యూనిఫామ్‌తోనే వచ్చేవారట. ఈ విశేషాలన్నీ దర్శకుడు బి.గోపాల్‌ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.