Read more!

English | Telugu

ఆ హీరోకి తొలి సినిమా.. ఆ హీరోయిన్‌కి మాత్రం అది 100వ సినిమా!

వినడానికి చాలా చిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఏ హీరోకైనా, ఏ హీరోయిన్‌కైనా వారి తొలి సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వారి మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాధారణంగా కొత్త హీరోకి జంటగా మరో కొత్త హీరోయిన్‌ని తీసుకోవడం జరుగుతుంటుంది. లేదా ఆ హీరో కంటే రెండు మూడు సినిమాలు సీనియర్‌ అయి వుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ 100 సినిమాలు పూర్తి చేసిన హీరోయిన్‌తో నటించాల్సి వస్తే.. ఆ అనుభవం ఎలా ఉంటుంది?

ఇది హీరో కృష్ణంరాజు విషయంలో జరిగింది. ఆయన తొలి సినిమా ‘చిలకా గోరింకా’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు రెండు సంవత్సరాలు ఎంతో కృషి చెయ్యాల్సి వచ్చింది. ‘బావామరదళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో మద్రాస్‌ రైలెక్కిన కృష్ణంరాజు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు ప్రత్యగాత్మ అతనికి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, తాను సొంతంగా నిర్మించే సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. అయితే కృష్ణంరాజుకి అసలు నటనలో ప్రవేశం లేదు, నాటకాలు వేసిన అనుభవం లేదు. తను సినిమా చేసేందుకు కొంత టైమ్‌ పడుతుందని, అప్పటివరకు నాటకాలు వేసి అనుభవం సంపాదించమని సూచించారు ప్రత్యగాత్మ. ఆయన చెప్పినట్టుగానే నాటకాలు వేస్తూ మంచి అనుభవం సంపాదించారు కృష్ణంరాజు. అప్పుడప్పుడు షూటింగ్‌లకు వెళుతూ కెమెరా ముందు ఎలా నటించాలి అనే విషయాల్లో మెళకువలు తెలుసుకున్నారు. 

1965 ఆగస్ట్‌ 6న ప్రత్యగాత్మ తన కొత్త సినిమా ‘చిలకా గోరింకా’ ప్రారంభించారు. కృష్ణంరాజు హీరో, కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ కాంబినేషన్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే కృష్ణకుమారి 100 సినిమాలు పూర్తి చేసిన సీనియర్‌ హీరోయిన్‌. అంతకుముందు ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అందుకే కొత్త హీరోతో అయినా నటించేందుకు ఆమె ఒప్పుకున్నారు. తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణంరాజుకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో కళాత్మక ధోరణి, వాపారాత్మక ధోరణి రెండూ ఉండడం వల్ల విజయం సాధించలేదు. అయితే ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందించింది.