Read more!

English | Telugu

చిరు, నాగ్‌, వెంకీలతో మల్టీస్టారర్‌ ప్లానింగ్‌.. బ్యాడ్‌లక్‌ డిజాస్టర్‌ అయింది!

ఒకప్పటి హీరోలు, వారి అభిమానుల ఆలోచనా ధోరణి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు. ఒకప్పుడు మల్టీస్టారర్‌ సినిమా చెయ్యాలంటే డైరెక్టర్లకు రిస్క్‌ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆయా హీరోల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చెయ్యాలి. సినిమా చేస్తున్నన్ని రోజులు వారిని అన్నివిధాలా శాటిస్‌ఫై చెయ్యాలి. అన్నింటినీ మించి సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మల్టీస్టారర్స్‌ చేసేవారు. పాతతరంలో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు.. వీళ్ళంతా మల్టీస్టారర్స్‌ చేశారు. కానీ, ఏరోజూ ఆయా హీరోల అభిమానులు గొడవ చేయలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు మల్టీస్టారర్‌ అనే మాటే లేకుండా సినిమాలు వచ్చాయి. మధ్యతరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో మల్టీస్టారర్‌ చేసే అవకాశం రాలేదు. 

90వ దశకంలో కొందరు అగ్ర దర్శకనిర్మాతలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఒక మల్టీస్టారర్‌ చేసేందుకు ప్రయత్నించారు. 1989లో వచ్చిన ‘త్రిదేవ్‌’ అనే బాలీవుడ్‌ మల్టీస్టారర్‌ను సన్ని డియోల్‌, జాకీష్రాఫ్‌, నసీరుద్దీన్‌ షా హీరోలుగా రాజీవ్‌ రాయ్‌ రూపొందించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు, బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాని తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో చేస్తే బాగుంటుందని ఓ అగ్రనిర్మాణ సంస్థ విపరీతంగా ప్రయత్నించింది. ఈ కథ ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపోయేలా ఉండడం, ముగ్గురి పాత్రలకు కూడా సరైన ప్రాధాన్యం ఉండడంతో తెలుగులో కూడా సూపర్‌హిట్‌ అవుతుందని భావించారు ఆ నిర్మాత. ఈ ప్రాజెక్ట్‌ గురించి ముగ్గురు హీరోలతో చర్చలు కూడా జరిగాయన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ మల్టీస్టారర్‌ చేసేందుకు ఆ ముగ్గురు హీరోలు అంగీకరించలేదా? లేక అలాంటి టాలెంట్‌ ఉన్న దర్శకుడు దొరకలేదో తెలీదుగానీ ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సుమన్‌, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌లతో ‘నక్షత్ర పోరాటం’  పేరుతో రీమేక్‌ చేశారు. అయితే ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ మల్టీస్టారర్‌ చెయ్యాలన్న ఆలోచన చేయలేదు. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్‌, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మల్టీస్టారర్‌ ట్రెండ్‌ స్ట్టార్ట్‌ అయింది.