English | Telugu
గిరిబాబు అప్పట్లో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరడానికి కారణం ఇదేనా?!
Updated : Aug 16, 2021
ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరిన సినీ ప్రముఖుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు ఒకరు. ఎన్టీఆర్ మీద అభిమానంతో, తెలుగువారికి ఆయన వల్ల మేలు జరుగుతుందనే అపార నమ్మకంతో ఆ పార్టీలో చేరారు. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలోనే ఒకరోజు అకస్మాత్తుగా ఆ పార్టీకి రాజీనామా చేసి, జాతీయ పార్టీ బీజేపీలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు గిరిబాబు. ఆయన అలా ఎందుకు చేశారనేది పార్టీలో ఉన్న చాలామందికి తెలుసు కానీ, ప్రజల్లో చాలా మందికి తెలీదు. అందుకే ఆయనపై విమర్శలు రేకెత్తాయి. అసలు ఎందుకు ఆరోజు ఆయన టీడీపీని వదిలేశారంటే...
గిరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. అప్పట్లో ఆ ఊరివాళ్లు కానీ, చుట్టుపక్కలవారు కానీ ఇంటర్మీడియేట్ చదువుకోవాలంటే ఒంగోలుకో, చీరాలకో వెళ్లేవారు. అబ్బాయిలు ఎలాగో వెళ్లి చదువుకొనేవారు కానీ, అమ్మాయిలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. దాంతో రావినూతలలో ఒక జూనియర్ కాలేజీ పెట్టించాలని గిరిబాబు ప్రయత్నించారు. అందుకోసం ఆయన తన సొంత భూమి ఒక ఎకరం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఊళ్లో చందాలు వసూలుచేశారు. కాలేజీ నిర్మాణానికి కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటుచేశారు.
అక్కడ జూనియర్ కాలేజీ ఏర్పాటుచేస్తే చుట్టుపక్కల 24 గ్రామాల పిల్లలకు మేలు జరుగుతుందని కూడా ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ ప్రభుత్వం అక్కడ కాలేజీ మంజూరు చేయలేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి ఉన్నారు. గిరిబాబు ప్రపోజల్‌కు ఆయన ఓకే కూడా చేశారు. కానీ ఏం జరిగిందో చివరి క్షణంలో అక్కడ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదు. దాంతో గిరిబాబు మనస్తాపం చెందారు. అయినా పట్టువదలకుండా కాలేజీ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా ప్రాధేయపడ్డారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో ఆయన టీడీపీని విడిచి బయటకు వచ్చారు. సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీలో కూడా ఆయన ఇమడలేదనేది వేరే విషయం.