Read more!

English | Telugu

రాజేంద్ర‌ప్ర‌సాద్, భానుప్రియతో రైట‌ర్ స‌త్యానంద్ ఓ సినిమాని డైరెక్ట్ చేశార‌ని తెలుసా?

 

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు స‌త్యానంద్‌. ఎన్టీ రామారావు ద‌గ్గ‌ర్నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు వ‌ర‌కు ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా, క‌థా ర‌చ‌యిత‌గా ప‌నిచేసి తెలుగు చిత్ర‌సీమ‌లోని పాపుల‌ర్ రైట‌ర్స్‌లో ఒక‌రిగా పేరుపొందారు. రైట‌ర్స్ డైరెక్ట‌ర్స్ కావ‌డం చాలా కాలం నుంచి ఉన్న‌దే. దాస‌రి, జంధ్యాల కాలం నుంచి ఇప్ప‌టి త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ దాకా ఎంతోమంది ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులుగా మారారు. వారిలో పైన చెప్పుకున్న‌వాళ్లు స్టార్ డైరెక్ట‌ర్స్ అనిపించుకున్నారు.

అదే త‌ర‌హాలో స‌త్యానంద్ కూడా డైరెక్ట‌ర్‌గా మారార‌ని ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌లో చాలామందికి తెలీదు. అయితే ఆయ‌న డైరెక్ట్ చేసింది ఒకే ఒక్క సినిమాకు. ఆ సినిమా 'ఝాన్సీరాణి' (1988). టైటిల్ రోల్‌ను భానుప్రియ చేసిన ఆ సినిమాలో హంత‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ నెగ‌టివ్ రోల్ చేశారు. ద‌గ్గుబాటి రాజా, ముచ్చ‌ర్ల అరుణ‌, పూర్ణిమ, రాజ్య‌ల‌క్ష్మి లాంటి తార‌లు కూడా ఇందులో న‌టించారు. మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి పాపుల‌ర్ న‌వ‌ల 'మిస్ట‌ర్ వి' ఆధారంగా ఈ సినిమాని తీశారు స‌త్యానంద్‌. మిద్దే రామారావు నిర్మించారు. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా ఫెయిలైంది. మిస్‌క్యాస్టింగ్ వ‌ల్లే ఈ సినిమా ఫెయిలైంద‌న్న‌ది స‌త్యానంద్ స్వీయ విశ్లేష‌ణ‌.

ఈ సినిమాకి ముందు 'లేడీస్ టైల‌ర్' సినిమాతో కామెడీ హీరోగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు చాలా పెద్ద పేరు వ‌చ్చింది. ఆ సినిమాలో ఆయ‌న జ‌నాన్ని విప‌రీతంగా న‌వ్వించారు. అలాంటిది.. అమ్మాయిల‌ను చంపే కిల్ల‌ర్ క్యారెక్ట‌ర్‌ను 'ఝాన్సీరాణి'లో చేశారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. తొలిరోజు సినిమా చూసిన‌వాళ్లు అంద‌ర్నీ న‌వ్వించే రాజేంద్ర‌ప్ర‌సాద్ అమ్మాయిల‌ను మ‌ర్డ‌ర్ చేసే క్యారెక్ట‌ర్ చేయ‌డం ఏమిట‌ని విమ‌ర్శించారు. ఆ మౌత్ టాక్ సినిమాకు ప్ర‌తికూలంగా ప‌నిచేసింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ కాకుండా మ‌రో హీరో ఎవ‌రైనా ఆ క్యారెక్ట‌ర్ చేసుండే ఫ‌లితం ఇంకోలా ఉండేద‌ని క్రిటిక్స్ అన్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ అనేసరికి కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసిన‌వాళ్లు అందుకు భిన్న‌మైన రోల్‌లో ఆయ‌న్ను చూసి పెద‌వి విరిచారు. చివ‌ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను కోర్టులో భానుప్రియ షూట్ చేసి చంపేస్తుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్‌లో ఆయ‌న‌ను ప్రేక్ష‌కులు చూడ‌లేక‌పోయారు.

'ఝాన్సీరాణి' రిలీజైన త‌ర్వాత కూడా ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు స‌త్యానంద్ డైరెక్ష‌న్‌లో సినిమా తీద్దామ‌ని వ‌చ్చారు. కానీ ఆయ‌న‌కే ఇక డైరెక్ష‌న్ వ‌ద్దు, రైట‌ర్‌గానే కంటిన్యూ అవుదాం అనిపించి, ఆ ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రించారు. అలా సింగిల్ మూవీ డైరెక్ట‌ర్‌గా నిలిచిపోయారు స‌త్యానంద్‌.