Read more!

English | Telugu

ఆ రోజుల్లోనే రాజ‌శేఖ‌ర్‌లో ఈ యాంగిల్ ఉంద‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

 

చెన్నై (అప్పుడు మ‌ద్రాస్‌)లోని పార్క్ షెర‌టాన్ హోట‌ల్ సినీ ప్ర‌ముఖ‌ల‌తో, తార‌ల అభిమానుల‌తో కిట‌కిట‌లాడుతున్న వేళ అది. అక్క‌డ 'అల్ల‌రి ప్రియుడు' శ‌త‌దినోత్స‌వం జ‌రుగుతోంది. రాజ‌శేఖ‌ర్‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌ధుబాల కాంబినేష‌న్‌తో కె. రాఘ‌వేంద్రరావు తీర్చిదిద్దిన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఆరోజు 'అల్ల‌రి ప్రియుడు' వేడుకలు ఆహ్లాద‌క‌రంగా, క్రికెట్ స్టార్స్ న‌డుమ ముగిశాయి. ఆటోగ్రాఫ్‌ల కోసం ఫ్యాన్స్ హీరో రాజ‌శేఖ‌ర్‌ని చుట్టుముట్టారు. అప్ప‌టికే బాలా ఆల‌స్య‌మైంది. అయిన‌ప్ప‌టికీ రాజ‌శేఖ‌ర్ ఓపిగ్గా వారి పేర్లు క‌నుక్కుంటూ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నారు. వీటి మ‌ధ్య ఓ మిడిల్ ఏజ్‌లో ఉన్న ఓ వ్య‌క్తి ఆయ‌న‌కు ఓ చీటీ అంద‌జేశాడు.

రాజ‌శేఖ‌ర్ సంత‌కం పెట్ట‌బోయి ఆగి, ఆ చీటీ చ‌దివి, ఆ మ‌నిషి వైపు చూశాడు. ఒక తండ్రి త‌న కొడుక్కి జ‌ర‌గాల్సిన స‌ర్జ‌రీకై ఆర్థిక స‌హాయం కోసం చేసిన అభ్య‌ర్థ‌న అది. రాజ‌శేఖ‌ర్ ఆయ‌న్ని వివ‌రాల‌డిగి, ఆ పేప‌ర్ వెనుక త‌న అడ్ర‌స్ రాసిచ్చి, మ‌ర్నాడు ఉద‌యం త‌న త‌మ్ముడ్ని క‌లుసుకోమ‌ని చెప్పి సంత‌కం పెట్టారు. మ‌ర్నాడు రాజ‌శేఖ‌ర్ హైద‌రాబాద్‌లో ఉంటారా? అనే సందేహం ఆ వ్య‌క్తికి వ‌చ్చింది.

"అన్నీ మా త‌మ్ముడు చూసుకుంటాడు. మీకే ఇబ్బంది ఉండ‌దు" అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌. అంత హ‌డావిడిలోనూ త‌మ్ముడు గుణ‌శేఖ‌ర్‌ను పిలిచి, ఆ వ్య‌క్తికి ప‌రిచ‌యం చేశారు. అప్పుడు ఆ వ్య‌క్తిలో తొణికిస‌లాడిన కృత‌జ్ఞ‌తా భావం మాట‌ల్లో చెప్ప‌లేనిది. శాటిస్‌ఫ్యాక్ష‌న్ అనేది ఒక క‌ళాకారుడిగా త‌న న‌ట‌న‌ను ప‌దిమందీ మెచ్చుకున్న‌ప్పుడు మాత్ర‌మే కాదు, ఇలాంటి సంద‌ర్భాల‌లోనూ అధికంగా క‌లుగుతుంద‌ని అనుకుంటారు రాజ‌శేఖ‌ర్ లాంటి యాక్ట‌ర్లు. ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ చేసిన సాయంతో ఆ వ్య‌క్తి త‌న కొడుక్కి శ‌స్త్ర చికిత్స చేయించార‌ని వేరే చెప్పాలా!