Read more!

English | Telugu

చ‌క్ర‌వ‌ర్తి మృతివార్త తెలిసి ఎస్పీ బాలు ఎంత హృద‌య‌విదార‌కంగా రోదించారో!

 

సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తెలుగు చిత్ర‌సీమ‌ను కొన్నేళ్ల‌పాటు మ‌కుటంలేని మ‌హారాజుగా ఏలేశారు. వారానికి ఏడు రోజులూ రిలాక్స‌నేది ఎరుగ‌కుండా ప‌నిచేసిన మ‌నిషాయ‌న‌. ముగ్గురు కొడుకుల్లో ఒక‌త‌ను మ‌ర‌ణించ‌డం, ఆ త‌ర్వాత కొద్దికాలానికే భార్య కూడా మృతిచెంద‌డంతో చ‌క్ర‌వ‌ర్తి మాన‌సికంగా బాగా కుంగిపోయారు. క్ర‌మేణా ప‌ని త‌గ్గించుకుంటూ వ‌చ్చి, సంగీతానికి దూర‌మయ్యారు. అయితే టీవీ సీరియ‌ల్స్ రైట‌ర్‌గా య‌మ‌బిజీగా ఉండే ఓంకార్ ఆయ‌న‌ను ఆ సీరియ‌ల్స్‌లో న‌టించ‌మ‌ని ఒత్తిడి చేశారు. అలా అయినా చ‌క్ర‌వ‌ర్తి న‌లుగురి మ‌ధ్య మెస‌లుతూ మామూలు మ‌నిష‌వుతార‌ని ఆయ‌న భావించారు. అలా బాలాజీ టెలీ ఫిలిమ్స్ నిర్మించిన 'క‌లిసుందాం రా!' సీరియ‌ల్‌లో హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ అనే మెయిన్ క్యారెక్ట‌ర్‌ చేశారు. 

ఆ సీరియ‌ల్‌లో న‌టించేట‌ప్పుడే ఒక‌రోజు రేస్ కోర్సు క్ల‌బ్‌లో లంచ్ చేసి, ఇంటికి వ‌చ్చారు చ‌క్ర‌వ‌ర్తి. ఒంట్లో అనీజీగా ఉంద‌ని చెప్తే వాళ్ల‌బ్బాయి శ్రీ (మ్యూజిక్ డైరెక్ట‌ర్‌) ఆయ‌న‌ను చెన్నైలోని విజ‌యా హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు మొద‌ట తేడా ఏమీ లేద‌న్నారు. అయితే ఎందుకైనా మంచిద‌ని ఒక‌రోజు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉన్న‌ట్లు ఉంటుంద‌ని హాస్పిట‌ల్‌లో ఉండ‌మ‌న్నారు. అలాగే ఉన్నారు చ‌క్ర‌వ‌ర్తి. సాయంత్రం నాలుగు దాటాక ఆయ‌న ఆరోగ్య స్థితిలో మార్పు వ‌చ్చింది. డాక్ట‌ర్లు ఆందోళ‌న‌తో మ‌రోసారి టెస్టులు చేశారు. రాత్రి ఏడున్న‌ర‌కు చ‌క్ర‌వ‌ర్తి ఇక‌లేరు అనే వార్త గుప్పుమంది. అభిమానులు, ఇండ‌స్ట్రీ జ‌నాలు షాకైపోయారు.

కాసేప‌ట్లో విజ‌య హెల్త్ సెంట‌ర్‌కు ఓ కారు వ‌చ్చి ఆగింది. అందులోంచి ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం దిగారు. అక్క‌డే బ‌య‌ట నిల్చొనివున్న శ్రీ‌ని చూసి, అత‌డిని ప‌ట్టుకొని, "అరేయ్ శ్రీ‌గా, ఏమ‌య్యిందిరా" అంటూ కారు డోరుకు త‌ల‌కొట్టుకున్నారు. "అరేయ్ చ‌క్ర‌వ‌ర్తీ.. ఏమ‌య్యావురా?" అని చేతులు పైకెత్తి అక్క‌డున్న వాళ్లంద‌రి క‌ళ్లు నీళ్ల‌తో నిండిపోయేలా రోదించారు. ఓంకార్ వ‌చ్చి బాలును ఓదార్చ‌డానికి ప్ర‌య‌త్నించారు. "ఏడండీ.. వాడేడండీ.. ఎక్క‌డ వాడు" అంటూ అరుస్తుంటే, "ఫారిన్ నుంచి వాళ్ల‌బ్బాయి రావాలి. అందుక‌ని బాడీని మార్చురీలో ఉంచాం" అని ఓంకార్‌ చెప్పారు.

చ‌క్ర‌వ‌ర్తి, బాలు మ‌ధ్య స్నేహ‌బంధం మామూలుది కాదు. ఆ ఇద్ద‌రి కెరీర్ స‌మాంత‌రంగా సాగుతూ వ‌చ్చింది. చ‌క్ర‌వ‌ర్తి స్వ‌రాలు కూర్చిన వేలాది పాట‌లు బాలు గ‌ళంలో జీవం పోసుకొని, సంగీత ప్రియుల నాలుక‌ల‌పై న‌ర్తిస్తూ వ‌చ్చాయి. ఇద్ద‌రూ "ఒరేయ్.. ఒరేయ్" అని పిలుచుకునేంత గాఢ స్నేహితులు. మూడు రాత్రులు విజ‌యా హాస్పిట‌ల్ మార్చురీలో చ‌క్ర‌వ‌ర్తి పార్థివ‌దేహం ఉంది. మూడో రోజు అమెరికా నుంచి వాళ్ల‌బ్బాయి వ‌చ్చాక ఏవీయం స్టూడియో ప‌క్క‌నున్న శ్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. శోభ‌న్‌బాబు, చంద్ర‌మోహ‌న్‌, సంగీత ద‌ర్శ‌కుడు కోటి వంటి కొద్దిమంది మాత్ర‌మే ఆ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. అలా చ‌క్ర‌వ‌ర్తి క‌థ భౌతికంగా స‌మాప్త‌మైంది. కానీ త‌ను సంగీతం స‌మ‌కూర్చిన పాట‌ల‌తో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌న‌తోనే ఉన్నారు.