English | Telugu

ఉత్తమ దర్శకుడుగా 5 జాతీయ అవార్డులు అందుకున్న భారతీరాజా!

(జూలై 17 దర్శకుడు భారతీరాజా పుట్టినరోజు సందర్భంగా..)

ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. వారి అభిరుచికి అనుగుణంగా కథలు ఎంపిక చేసుకుంటే ఎక్కువ సక్సెస్‌ సాధించగలుగుతారు దర్శకులు. ఏ ట్రెండ్‌ అయినా ఓ పది సంవత్సరాలు ఉంటుంది. ఆ కాలంలో ఆ తరహా సినిమాలే వస్తుంటాయి. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తుంటారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచిస్తారు. అలాంటి కొత్త ఆలోచనలతో 1970వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు భారతీరాజా. ఆ సమయంలో మన సినిమాల్లోని కథలు.. హీరో, హీరోయిన్‌ ప్రేమించుకోవడం ఆ తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి విడిపోవడం, చివరలో కలుసుకోవడంతో ముగుస్తుంది. దానికి భిన్నంగా కథలు ఉండాలన్న ఆలోచన భారతీరాజాకు ఉండేది. అలాంటి కథలతోనే సినిమాలు తీసి మంచి విజయాలు అందుకున్నారు. తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాలకు దర్శకత్వం వహించిన భారతీరాజాకు ఇండియన్‌ సినిమాలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం రొటీన్‌కి భిన్నంగానే ఉంటాయి. దర్శకుడిగానే కాదు, నటుడుగా కూడా ఎన్నో సినిమాలు చేశారు భారతీరాజా. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా ఆణిముత్యాల్లాంటి సినిమాలతో తనదైన ముద్ర చూపించారు.

1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించారు భారతీరాజా. ఆయన అసలు పేరు చిన్నస్వామి. సినిమాలపై ఆసక్తి ఉండడంతో మద్రాస్‌ చేరుకొని కన్నడ డైరెక్టర్‌ పుట్టణ్న కనగళ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత పి.పుల్లయ్య వంటి ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేశారు. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘16 వయతనిలే’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు భారతీరాజా. 1977లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రేమకథను ఇలా కూడా తియ్యొచ్చు అని ఈ సినిమాతో నిరూపించారు భారతీరాజా. ఆ మరుసటి సంవత్సరం ఇదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో రీమేక్‌ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

భారతీరాజా తెలుగులో నాలుగు సినిమాలు మాత్రమే డైరెక్ట్‌ చేశారు. అవి కొత్త జీవితాలు, సీతాకోక చిలక, ఆరాధన, జమదగ్ని. వీటిలో కొత్త జీవితాలు, సీతాకోక చిలక సూపర్‌హిట్‌ అయ్యాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా తమిళ్‌లో ఆయన చేసిన సూపర్‌హిట్‌ సినిమాలను తెలుగులోకి అనువదించేవారు లేదా రీమేక్‌ చేసేవారు. నందమూరి బాలకృష్ణకు మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మంగమ్మగారి మనవడు చిత్రానికి భారతీరాజా కథ అందించారు. అలాగే కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా తమిళ్‌లో రూపొందిన సిగప్పు రోజాక్కాల్‌ చిత్రాన్ని తెలుగులో ఎర్రగులాబీలు పేరుతో డబ్‌ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన టిక్‌టిక్‌టిక్‌ చిత్రం కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు భారతీరాజా. అయితే ఆయన నటించిన సినిమాలన్నీ తమిళ్‌లో రూపొందినవే. అందులో చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అలాగే తమిళ్‌లో కొన్ని టీవీ సీరియల్స్‌కి కూడా భారతీరాజా దర్శకత్వం వహించారు. కొందరు తమిళ నటులకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. భారతీరాజా తన కెరీర్‌లో అన్నీ వైవిధ్యమైన సినిమాలే చేశారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను 2004లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఉత్తమ దర్శకుడిగా 5 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇవి కాక ఫిలింఫేర్‌ అవార్డులు, తమిళనాడు స్టేట్‌ అవార్డులు అనేకం ఉన్నాయి. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలక చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అలాగే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు.. ఇలా 5 అవార్డులు ఈ సినిమా గెలుచుకుంది.