English | Telugu
సినిమాటోగ్రఫీకే కొత్త వన్నె తెచ్చిన వి.ఎస్.ఆర్.స్వామి!
Updated : Jul 15, 2025
ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. కానీ, డైరెక్టర్‌కి సమాన స్థాయిలో పనిచేసే మరో టెక్నీషియన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఒక సినిమా అద్భుతంగా రావడానికి కథ, కథనాలు, నటీనటుల అభినయం ముఖ్యం. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడం దర్శకుడు చెయ్యాల్సిన పని. అయితే ఆ సన్నివేశాన్ని డైరెక్టర్ ఊహకు తగ్గట్టుగా తెరకెక్కించడం అనేది సినిమాటోగ్రాఫర్ పని. ఒక సీన్‌ని డైరెక్టర్ ఎంత అందంగా చెప్పినా దాన్ని స్క్రీన్ మీద అదే స్థాయిలో సినిమాటోగ్రఫర్ చిత్రీకరించలేకపోతే డైరెక్టర్ కూడా ఫెయిల్ అవుతాడు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండిరగ్‌తో పనిచేస్తేనే మంచి సినిమా తయారవుతుంది. సినిమా మొదలైన నాటి నుంచి ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లు అద్భుతమైన సినిమాలతో తమ ప్రతిభను చాటుకున్నారు. అయితే ఒక సినిమాటోగ్రాఫర్‌కి స్టార్ స్టేటస్ రావడం అనేది వి.ఎస్.ఆర్.స్వామితోనే మొదలైంది. సినిమాటోగ్రాఫర్‌గా అతన్ని తీసుకుంటే చాలు తన సినిమాకి ఢోకా లేదు అనే నమ్మకం డైరెక్టర్లకు కలిగించారు స్వామి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలకు వి.ఎస్.ఆర్.స్వామి ఛాయాగ్రహణ దర్శకుడిగా వ్యవహరించారు. సినిమా రంగంలో ఫోటోగ్రఫీనే ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి సినిమాలకు పనిచేశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.
1935 జూలై 15న కృష్ణా జిల్లా వలివర్తిపాడు గ్రామంలో జన్మించారు వి.ఎస్.ఆర్.స్వామి. చిన్నతనం నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టపడేవారు స్వామి. ఆ ఆసక్తితోనే సినిమాటోగ్రాఫర్ సి.నాగేశ్వరరావు దగ్గర చేరారు. పాండవ వనవాసం, గుడిగంటలు, ఆస్తులు, అంతస్తులు, ఆరాధన వంటి సూపర్‌హిట్ సినిమాలకు సి.నాగేశ్వరరావు అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించారు. ఆయన దగ్గర సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు స్వామి. ఆ తర్వాత రవికాంత్ నగాయిచ్, ఎస్.శంకర్‌ల వద్ద కూడా పనిచేశారు. అలాగే వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు ఆపరేటివ్ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన అసాధ్యుడు చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు స్వామి.
వి.ఎస్.ఆర్.స్వామి పనితనం బాగా నచ్చడంతో తను నటించిన చాలా సినిమాలు, కొన్ని సొంత సినిమాలు అతనితోనే చేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు స్వామి. సినిమా చిత్రీకరణలో ఎన్నో ప్రయోగాలు చేశారు. 1986లో కృష్ణ హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి 70 ఎంఎం సినిమా సింహాసనంకు స్వామి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర ఎం.వి.రఘు, ఎస్.గోపాలరెడ్డి, సి.రాంప్రసాద్ శిష్యరికం చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్లుగా ఎదిగారు.
సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన అల్లూరి సీతారామరాజు అంత అద్భుతంగా రావడం వెనుక డైరెక్టర్లు వి.రామచంద్రరావు, కృష్ణలతోపాటు వి.ఎస్.ఆర్.స్వామి కృషి కూడా ఎంతో ఉంది. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అందాలరాముడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, సిరిసిరిమువ్వ, ఖైదీ, కొండవీటి దొంగ, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర చిత్రాలు వాటిలో కొన్ని మాత్రమే. వి.ఎస్.ఆర్.స్వామిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎంతో మంది సినిమాటోగ్రాఫర్లుగా తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
సినిమాటోగ్రాఫర్‌గానే కాదు, దర్శకుడుగా తెలుగులో ఆపద్బాంధవులు, హిందీలో మహాశక్తిమాన్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎదురీత చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ ద్వారా బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన చివరి సినిమా ప్రభాస్ హీరోగా నటించిన ‘అడవిరాముడు’. 40 సంవత్సరాల కెరీర్‌లో 250 సినిమాలకు ఛాయాగ్రహణాన్ని అందించారు స్వామి. టెక్నికల్‌గా సినిమా పరిశ్రమ ఎదుగుతున్న వివిధ దశల్లో తన సినిమాటోగ్రఫీతో ఎన్నో ప్రయోగాలు చేసిన వి.ఎస్.ఆర్.స్వామి 2008 నవంబర్ 12న 70 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
(జూలై 15 సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్.స్వామి జయంతి సందర్భంగా..)