English | Telugu
రాళ్లపల్లి పెద్ద కుమార్తె రష్యాకు వెళ్తూ ట్రైన్‌లోనే చనిపోయిందని మీకు తెలుసా?
Updated : Jul 24, 2021
రాళ్లపల్లి నరసింహారావు అంటే మనలో చాలా మంది ఎవరాయన? అనడుగుతారు. రాళ్లపల్లి అంటే మాత్రం తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన నటుడని చెప్పేస్తారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ రెండేళ్ల క్రితం ఆయన కన్నుమూశారు. అయితే ఆయనకు ఇద్దరు కుమార్తెలనీ, వారిలో పెద్దమ్మాయి రష్యాలో డాక్టర్ కోర్సు చదవడానికని వెళ్తూ మార్గమధ్యంలో చనిపోయిందనీ మనలో చాలామందికి తెలీదు. అవును.
రాళ్లపల్లి పెద్దమ్మాయి పేరు మాధురి. నలుగురి ఆరోగ్యాన్ని బాగుచేసే వైద్యురాలిగా పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నది. రష్యాలో మెడిసిన్ చదవాలని బయలుదేరింది. ట్రైన్‌లో వెళ్తుంటే వైరల్ ఫీవర్ లాంటిదేదో సోకి, సకాలంలో వైద్యం అందక, అదే ట్రైన్‌లో ప్రాణాలు కోల్పోవడం ఎంతటి బాధాకరం! ఆమెను భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి చెన్నైకి రప్పించడానికి అప్పటి ప్రధాన మంత్రి దివంగత పి.వి. నరసింహారావు సైతం సాయం చేశారు.
మాధురి ఆకస్మిక మృతిని రాళ్లపల్లి తట్టుకోలేకపోయారు. కూతుళ్లంటే ఆయనకు అమితమైన ప్రేమ. పెద్దమ్మాయి పోయిన దుఃఖాన్ని చాలా కాలం ఆయన మోశారు. ఆమెను మరచిపోలేక, ఆమె మీద ప్రేమతో 'మాధురి' అనే అక్షరాలను తన ప్రతి చొక్కా జేబుపై కుట్టించుకునేవారు. ఎక్కడికైనా ఆ చొక్కాలు వేసుకొనే వెళ్లేవారు. పార్టీలకో, ఏవైనా ప్రోగ్సామ్స్‌కో తప్ప తాను చనిపోయేంత వరకూ ఆయన అలాగే చేసేవారు.