English | Telugu

చిరంజీవిని ఫూల్‌ చేద్దామ‌నుకొని...

పూర్ణిమ అన‌గానే మ‌న‌కు 'ముద్ద‌మందారం', 'నాలుగు స్తంభాలాట‌', 'మా ప‌ల్లెలో గోపాలుడు' సినిమాలు ముందుగా గుర్తుకువ‌స్తాయి. 'పుత్త‌డి బొమ్మ‌'గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం పొందిన పూర్ణిమ ఒక‌సారి ఏప్రిల్ 1న ఎవ‌ర్ని ఫూల్ చెయ్యాలా అని ఆలోచించి ఫోన్‌లో కొన్ని నంబ‌ర్ల‌కు ట్రై చేశారు. ముందు చంద్ర‌మోహ‌న్‌ను ఫూల్ చేద్దామ‌నుకున్నారు. కానీ అప్పుడాయ‌న ఊళ్లో లేరు. చివ‌ర‌కు ఓ మంచి ఐడియా త‌ట్టింది. స‌రే అనుకుంటూ చిరంజీవి నంబ‌ర్‌కు ట్రై చేశారు.

"హ‌లో" అంది అవ‌త‌లి కంఠం. అది చిరంజీవి గొంతుకాద‌ని ఆమెకు అర్థ‌మైంది.
"హ‌లో.. చిరంజీవి గారున్నారండీ?" అని అడిగారు.
"ఎవ‌రూ?" అంది అవ‌త‌లి కంఠం.
"నేను ఆయ‌న అభిమానిని." చెప్పారు పూర్ణిమ‌.
"ఒక్క నిమిషం" అంది అవ‌త‌లి కంఠం.
ఒక‌ట్రెండు నిమిషాల త‌ర్వాత "చిరంజీవి హియ‌ర్" అని వినిపించింది.
"హ‌లో.. చిరంజీవి గారా.. న‌మ‌స్తే అండీ. నేను మీ అభిమానిని. ఒంగోలు నుంచి వ‌చ్చాను, మిమ్మ‌ల్ని చూద్దామ‌ని. నా పేరు శాంతి." అన్నారు పూర్ణిమ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ.

"ఓ.. ఐసీ.. అలాగా. చాలా సంతోషం. ఏం చేస్తుంటారు?" అడిగారు చిరంజీవి.
"బీయ‌స్సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాను సార్‌." చెప్పారు పూర్ణిమ‌.
"ఏ కాలేజీలో?" అడిగారు చిరంజీవి.
"ఒంగోలు యూనివ‌ర్సిటీ కాలేజీ." అనేశారు పూర్ణిమ‌. నిజానికి ఒంగోలులోని కాలేజీల పేర్లేవీ ఆమెకు తెలీదు.

క్ర‌మంగా ఆయ‌న సినిమాలు, ఆయ‌న న‌ట‌న గురించి మాట్లాడుతూ కొంత‌సేప‌య్యాక "నేనెవ‌రో గుర్తుప‌ట్టారా?" అన‌డిగారు పూర్ణిమ‌.
"ఎవ‌రూ?" అని అడిగారు చిరంజీవి ఆశ్చ‌ర్యంగా.
"నేను, మీరు క‌లిసి ఓ సినిమాలో న‌టించాం కూడా." అని క్లూ ఇచ్చారు పూర్ణిమ‌.
అప్ప‌టికీ చిరంజీవికి గుర్తు రాలేదు.
"ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌లో మ‌నిద్దం క‌లిసి ఒక సాంగ్ కూడా చేశాం." అని మ‌రో క్లూ ఇచ్చారు పూర్ణిమ‌.

"ఓ పూర్ణిమా.. ఇవాళ ఏప్రిల్ ఒక‌టో తేదీ అని నాకు తెలుసు. ఇంత‌కీ నువ్వు ఫోన్ చెయ్య‌గానే ముందు మాట్లాడింది ఎవ‌రో తెలుసా?" అడిగారు చిరంజీవి.
"మీ సెక్ర‌ట‌రీ" చెప్పారు పూర్ణిమ‌.
"కాదు నేనే.. గొంతు మార్చి మాట్లాడాను." అన్నారు చిరంజీవి కూల్‌గా.
అప్పుడు ఫూల్ అవ‌డం పూర్ణిమ వంతైంది.