Read more!

English | Telugu

ఆనాటి సంగతి: అప్పటి చిన్న శాస్త్రి ఇప్పటి కళాతపస్వి!

 

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'కలిసొచ్చిన అదృష్టం' (1968) చిత్రంలో సీనియర్ నటి శాంతకుమారిని ఓ పాత్ర కోసం బుక్ చేసినప్పుడు "మీకు కథ వినిపించడానికి మా డైరెక్టర్‌ను ఎప్పుడు పంపించమంటారు?" అనడిగారు నిర్మాత మిద్దే జగన్నాథరావు. "డైరెక్టర్ గారు మా ఇంటికి రావడమా? నేనే మీ ఆఫీసుకు వచ్చి కథ వింటాను" అన్నారు శాంతకుమారి. కంపెనీ కారులో ఆఫీసుకు వెళ్లిన ఆమెకు అక్కడ చిన్న శాస్త్రి అనే యువకుడు "రండమ్మా" అంటూ నవ్వుతూ స్వాగతం పలికాడు. అతడిని చిన్న శాస్త్రి అని పిలిచేవాళ్లు. 

ఆ చిన్న శాస్త్రి వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజినీర్‌గా ఎప్పుడూ ఖాకీ యూనిఫాంలో కనిపించేవాడు. ఇప్పుడు కూడా అవే దుస్తుల్లో ఉన్నాడు. "నువ్విక్కడున్నావేమిటి చిన్న శాస్త్రీ?" అనడిగారు శాంతకుమారి. "ఈ పిక్చర్‌కు నేనేనమ్మా డైరెక్టర్‌ను" అన్నాడతను. "నీ ఇల్లు బంగారం కానూ! నువ్వెప్పుడు డైరెక్టర్‌వి అయ్యావు నాయనా!" అని ఆశ్చర్యపోయారు శాంతకుమారి. ఆ చిన్న శాస్త్రే డైరెక్టర్ కె. విశ్వనాథ్. 

ఆయ‌న‌ కథ వినిపిస్తుంటే, తన పాత్ర కాస్త విచిత్రంగా కొత్త తరహాలో ఉన్నట్లనిపించింది ఆమెకు. "నేనెప్పుడూ ఏవో ఏడ్చే పాత్రలే చేశాను కానీ, వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే ఈ హాస్య పాత్రను చేయగలనా?" అన్నారామె. "మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? రామారావు గారు కూడా ఆ పాత్రకు మీరే కరెక్టుగా సూటవుతారని చెప్పారు" అన్నారు విశ్వనాథ్. ఆ కామెడీ పాత్రలో తనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని శాంతకుమారి భయపడ్డారు. కానీ 'కలిసొచ్చిన అదృష్టం' సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రను అంతా మెచ్చుకున్నారు. అలాగే 'చిన్ననాటి స్నేహితులు' (1971) చిత్రంలో కూడా విశ్వనాథ్ ఆమె చేత మరో కొత్త పాత్రను అందరి మెప్పూ పొందేలా చేయించారు.