Read more!

English | Telugu

కంప్యూట‌ర్ సైన్స్ నుంచి థియేట‌ర్ ఆర్ట్స్‌కు మారిన ల‌క్ష్మీ మంచు!

 

ల‌క్ష్మీ మంచు యు.ఎస్‌.లో చ‌దువుకున్నార‌నే విష‌యం చాలా మందికి తెలీదు. డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన‌ప్పుడు అంద‌రు ద‌క్షిణాది అమ్మాయిల్లాగే ఆమె కూడా ఒక్ల‌హామా సిటీ యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో చేరారు. క్లాస్‌లో కూర్చుంటే నిద్ర వ‌చ్చేసేది. ఒక్క ముక్క అర్థ‌మ‌య్యేది కాదు. మాథ్స్ అస్స‌లు ఎక్కేది కాదు. ఫ‌స్ట్ సెమిస్ట‌ర్‌లో ఉండ‌గానే ఒక‌సారి కాలేజీలో ఏదో నాట‌కం వేస్తుంటే వెళ్లారు. అక్క‌డి స్టేజ్ త‌న‌ను పిలుస్తున్న‌ట్లే అనిపించింది. త‌నేం కోల్పోయిందో ఆ క్ష‌ణంలోనే అర్థ‌మైంది.

మ‌రుస‌టి రోజు త‌న కౌన్సిల‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి "న‌న్ను థియేట‌ర్ ఆర్ట్స్‌లోకి మార్చేయండి" అని అడిగారు ల‌క్ష్మి. ఆమె "పిచ్చా, వెర్రా" అని తిట్టింది. "అది కంప్లీట్‌గా ఇంగ్లీష్ ఓరియంటెడ్ థియేట‌ర్. షేక్‌స్పియ‌ర్ ద‌గ్గ‌ర్నుంచి ఇప్ప‌టిదాకా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చేసిన నాట‌కాల‌న్నీ నేర్చుకోవాలి. పైగా ఇక్క‌డ నువ్వొక్క‌దానివే ఇండియ‌న్ స్టూడెంట్‌వి. చాలా క‌ష్టం" అని చెప్పింది. కానీ ల‌క్ష్మి విన‌లేదు. థియేట‌ర్ ఆర్ట్స్‌కి మారింది.

ఆ త‌ర్వాత కాలేజీలో ప్ర‌తి నాట‌కంలోనూ ఆమె పార్టిసిపేట్ చేస్తూ వ‌చ్చారు. నిజానికి అది సుల‌భం కాదు. అంద‌రినీ సెల‌క్ట్ చేయ‌రు. ప్ర‌తి నాట‌కానికీ ఆడిష‌న్స్ జ‌రుగుతాయి. దాన్ని బ‌ట్టే న‌ట‌న‌లో ఆమె ప్ర‌తిభ ఏమిట‌నేది అర్థం చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టే తెలుగులో న‌టించిన తొలి సినిమా 'అన‌గ‌నగా ఓ ధీరుడు'లో చేసిన ఐరేంద్రి క్యారెక్ట‌ర్‌తోటే ఉత్త‌మ విల‌న్‌గా నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో నటించ‌డానికంటే ముందు 'ది ఓడ్‌', 'డెడ్ ఎయిర్' అనే ఇంగ్లీష్ సినిమాల్లో ఆమె న‌టించారు. నిజానికి సినిమాల కంటే ముందు అమెరిక‌న్ టెలివిజ‌న్ సిరీస్‌ల‌లో న‌టించారు ల‌క్ష్మి. మొద‌ట‌గా 2004లోనే 'లాస్ వేగాస్' సిరీస్‌లో చేసిన స‌ర‌స్వతి క్యారెక్ట‌ర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది.