Read more!

English | Telugu

'య‌ముడికి మొగుడు'కు ఆధారం హాలీవుడ్ ఫిల్మ్ 'హెవెన్ కెన్ వెయిట్‌'!

 

చిరంజీవి హీరోగా ర‌విరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన 'య‌ముడికి మొగుడు' (1988) ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. విజ‌య‌శాంతి, రాధ హీరోయిన్లుగా న‌టించిన ఆ సినిమాలో య‌మునిగా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. చిరంజీవి స్నేహితులు, న‌టులు జి.వి. నారాయ‌ణ‌రావు, సుధాక‌ర్‌, హ‌రిప్ర‌సాద్ ఆ సినిమాని నిర్మించారు. ఆ సినిమా స్క్రిప్టులో తాను కూడా పాలుపంచుకున్న‌ట్లు నారాయ‌ణ‌రావు వెల్ల‌డించారు. తెలుగువ‌న్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని కూడా పంచుకున్నారు. అది.. 'య‌ముడికి మొగుడు'కు ఆధారం హాలీవుడ్‌లో వ‌చ్చిన 'హెవెన్ కెన్ వెయిట్' (1978) అనే సినిమా అని! ఆ మూవీని వారెన్ బీట్టీ, బ‌క్ హెన్రీ సంయుక్తంగా డైరెక్ట్ చేయ‌గా, హీరోగా వారెన్ బీట్టీ న‌టించాడు.

"య‌ముడికి మొగుడు క‌థ‌ను నేను, స‌త్యానంద్ క‌లిసి త‌యారుచేశాం. టైటిల్స్‌లో స‌త్యానంద్‌గారి పేరు వేసినా, స్క్రిప్టులో నేను కూడా ఇన్‌వాల్వ్ అయ్యాను. య‌మ‌లోకం పాయింట్‌ను చెప్పింది నాగ‌బాబు. 'హెవెన్ కెన్ వెయిట్' అనే ఇంగ్లీష్ పిక్చ‌ర్‌ను ఆయ‌న స‌జెస్ట్ చేశారు. అది బాగానే ఉంద‌నిపించి తీద్దామ‌నుకున్నాం." అని  నారాయ‌ణ‌రావు చెప్పారు.

అలాంటి క‌థ‌లు ఆయ‌న బాగా రాస్తార‌నే ఉద్దేశంతో స్క్రిప్టు రాయ‌డానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత డి.వి. న‌ర‌స‌రాజు ద‌గ్గ‌ర‌కు వెళ్లామ‌ని తెలిపారు. "అయితే ఇప్ప‌టికే త‌ను ఆరుసార్లు అలాంటి క‌థ‌ల‌ను రాశాన‌నీ, ఆ స‌బ్జెక్టు బాగానే ఉంటుంద‌నీ ఆయ‌న‌ అన్నారు. ఆయ‌న‌తో క‌థాచ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ప్పుడు స‌త్యానంద్ ఓ పాయింట్ చెప్పారు. మ‌నిషిని పోలిన మ‌నుషులు ఈ ప్ర‌పంచంలో ఏడుగురు ఉంటార‌నీ, ఒక‌ మ‌నిషి త‌న‌లాగే ఉన్న ఇంకో మ‌నిషిలోకి రావ‌డ‌మ‌నే పాయింట్ ఆయ‌న చెప్పారు. దాంతో స‌త్యానంద్ గారిని స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా తీసుకున్నాం. అలా ఆయ‌నే ఆ సినిమాకి రాశారు." అని చెప్పుకొచ్చారు నారాయ‌ణ‌రావు. ఆ సినిమాతో నిర్మాత‌లుగా ఆర్థికంగా తాము బాగా సెటిల్ అయ్యామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.