English | Telugu
చిన్నతనంలోనే ఇరాక్‌లో యుద్ధాన్ని చూసిన గౌతమి!
Updated : Jul 2, 2021
నటి గౌతమి శ్రీకాకుళంలో ఓ డాక్టర్ల కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు టి.ఆర్. శేషగిరిరావు, వసుంధరాదేవి.. ఇద్దరూ డాక్టర్లే. గౌతమి చిన్నతనం చాలా సరదాగా గడిచింది. ఆమె నాలుగో క్లాస్‌లో ఉన్నప్పుడు ఓ చిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు వాళ్ల అమ్మానాన్నలు ఇరాక్‌లో ఉండేవారు. ఓసారి సెలవులకు గౌతమి, ఐదో క్లాస్ చదువుతున్న వాళ్లన్నయ్య కలిసి ఇరాక్‌కు వెళ్లడానికి బెంగళూరు నుంచి బొంబాయి వెళ్లి, అక్కడ్నుంచి ఫ్లైట్‌లో టెహ్రాన్ ఎయిర్‌పోర్టులో దిగారు. వాళ్లకు అక్కడి భాష రాదు. అక్కడివాళ్లకు ఇంగ్లీష్ రాదు. పాసింజర్స్ అంతా వెళ్లిపోయారు.
వాళ్ల లగేజ్ సెక్యూరిటీ చెకప్ పూర్తిచేసుకొని రావడానికి కొంచెం ఆలస్యం అయింది. చివరకు అన్నాచెల్లెళ్లిద్దరే మిగిలారు. ఏం చెయ్యడానికీ పాలుపోలేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్లు చాలా స్ట్రిక్టుగా ఉంటారు. ప్రయాణీకుల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్లను ఎయిర్‌పోర్ట్ లోనికి రానివ్వరు. ఆ కారణంగా గౌతమి వాళ్ల అమ్మానాన్నలు బయటే ఉండిపోయారు. పిల్లలిద్దరూ ఎటు వెళ్లాలో, ఏమిటో తెలీని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆపద్బాంధవుడిలా ఓ సెక్యూరిటీ గార్డు వాళ్ల దగ్గరకు వచ్చి వారిని బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ అమ్మానాన్నలు కనిపించడంతో ప్రాణం లేచివచ్చినట్లయింది. భావోద్వేగంతో వాళ్లను కరుచుకుపోయారు.
ఆ టైమ్‌లోనే ఇరాక్‌లో వాళ్లుంటున్న ఇంటి దగ్గర ఓ భయానక ఘటన జరిగింది. వారి ఇల్లు ఇరాక్-ఇరాన్ బోర్డర్‌లో ఉండేది. ఓ రోజున గౌతమి, వాళ్లన్నయ్య ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నారు. బయట టపాకాయలు పేలిన శబ్దం వినిపించింది. ఏమిటో చూద్దాం అని ఇద్దరూ బయటకు వెళ్లి చూశారు. చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. కానీ శబ్దం మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆ శబ్దం వచ్చిన దిశలో.. అంటే వాళ్ల ఇంటి వెనుకవైపు.. ఓ కొండ ఉంది. అదేమిటో చూద్దామని పిల్లలిద్దరూ ఆ కొండ ఎక్కారు.
ఇంకేముందీ.. అవతల.. మిలటరీ సోల్జర్స్.. వాళ్ల చేతుల్లో గన్స్!.. విషయం ఏమంటే.. అక్కడప్పుడు యుద్ధం జరుగుతోంది. ఓ వైపు గన్స్ పేలుతున్నాయి, ఇంకోవైపు బాంబులు మోగుతున్నాయి. పైప్రాణాలు పైనే పోయినంత పనై, భయంతో వణుకుతూ ఇంటికి పరుగెత్తుకొని వచ్చేశారు. ఆ తర్వాత చూస్తే, వాళ్లున్న టౌన్‌కూ, పక్కనే ఉన్న పల్లెకూ మధ్యనున్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఎంతగా అంటే.. అటువాళ్లు ఇటుకానీ, ఇటువాళ్లు అటుకానీ వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. అదొక చిత్రమైన, భయాందోళనలను గురించేసిన ఘటన. ఇప్పటికీ దాన్ని తలచుకుంటే గౌతమికి ఒళ్లు జలదరిస్తుంటుంది.