Read more!

English | Telugu

చిరంజీవి డాన్స్‌పై విమర్శ.. అప్పుడు మెగాస్టార్‌ తీసుకున్న నిర్ణయం ఏమిటి?

డాన్స్‌ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డాన్స్‌.. డాన్సుల్లో చిరు ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌. అతనిలా స్టెప్పులు వేయాలని, మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఎందుకంటే సినిమా డాన్సుల్లో ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చింది చిరంజీవే. అప్పటివరకు హీరోలు ఏదో డాన్స్‌ చేస్తున్నామంటే చేస్తున్నాం అనేలా చేసేవారు. కానీ, చిరు మాత్రం డాన్స్‌ని ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకున్నారు. అదే ఆయనకు మంచి డాన్సర్‌ అనే పేరు తీసుకొచ్చింది. డాన్స్‌ని అంత ఓన్‌ చేసుకొని చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. తన డాన్స్‌పై వచ్చిన ఓ విమర్శ వల్లే తనను తాను మార్చుకున్నారు చిరు. ఇది నిజం. 

కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించిన తర్వాత సోలో హీరోగా తన కెరీర్‌ని ప్రారంభించిన తొలి రోజుల్లో ఒక సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన ఇది. చిరంజీవి, గ్రూప్‌ డాన్సర్లతో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత అందరూ చిరు డాన్స్‌ని మెచ్చుకుంటూ క్లాప్స్‌ కొట్టారు. కానీ, ఒక్కరు మాత్రం చిరు పెర్‌ఫార్మెన్స్‌కి స్పందించకుండా అలా చూస్తున్నారు. దానికి ఆశ్చర్యపోయిన చిరు ఆయన దగ్గరకు వెళ్ళి ‘ఎలా ఉంది డాన్స్‌?’ అని అడిగారు. ‘నీ వెనక ఉన్న డాన్సర్లు ఏం చేశారో, నువ్వు కూడా అదేగా చేసింది. అందులో నీ స్పెషాలిటీ ఏం ఉంది?’ అని అన్నాడు. అతని పేరు వెంకన్నబాబు. ఆ సినిమాకి మేనేజర్‌గా పనిచేశాడు. ఆయన మాటలతో ఆలోచనలో పడ్డారు చిరంజీవి. ‘నేను ఆ పాటకు చేసిన డాన్స్‌పై ఆయన చేసిన కామెంట్స్‌ నన్ను పూర్తిగా మార్చాయి. డాన్స్‌మాస్టర్లు చెప్పింది చెయ్యడం కాదు, నేను చేసేది దానికి కాస్త భిన్నంగా ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి డాన్స్‌ని ఓన్‌ చేసుకొని ఆస్వాదిస్తూ చేయడం అలవాటు చేసుకున్నాను’ అంటూ తన కెరీర్‌ తొలిరోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు చిరు. 

ఆ తర్వాతి రోజుల్లో చిరంజీవి డాన్స్‌కి ఎంత క్రేజ్‌ వచ్చిందో అందరికీ తెలిసిందే. యూత్‌తోపాటు పిల్లలు కూడా చిరు డాన్స్‌ని ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా చిరు డానన్స కోసమే సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత చిరంజీవిని ఇమిటేట్‌ చేస్తూ డాన్స్‌ చేసిన హీరోలు కూడా ఉన్నారు. తన డాన్స్‌ గురించి వచ్చిన విమర్శని నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా ఆలోచించి తనని తాను మార్చుకున్నారు కాబట్టే ఆడియన్స్‌ని తన స్టెప్పులతో మెస్మరైజ్‌ చెయ్యగలిగారు చిరు.