Read more!

English | Telugu

విధి క్రూరంగా విడ‌దీసిన అంద‌మైన ప్రేమ‌జంట పునీత్-అశ్విని!

 

పునీత్ రాజ్‌కుమార్‌, అశ్వినీ రేవంత్‌ను చూసిన‌వాళ్లు వెంట‌నే అనేస్తారు.. 'మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్' అని. కానీ క్రూర‌మైన విధి వారిని విడ‌దీసింది. క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ 1999 డిసెంబ‌ర్ 1న వైభ‌వంగా జ‌రిగిన వేడుక‌లో అశ్వినీ రేవంత్ మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. అంత‌కంటే ముందు, మూడేళ్ల క్రితం ఆ ఇద్ద‌రూ క‌లుసుకున్నారు. 

అదెలాగంటే.. పునీత్ చ‌దువు పూర్త‌య్యాక‌, 1996లో ఒక‌రోజు ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా అశ్విని ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత తాము ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నామ‌నే విష‌యం గ్ర‌హించారు. ఎనిమిది నెల‌ల త‌ర్వాత‌ త‌న జీవిత భాగ‌స్వామి అశ్విని అని డిసైడ్ అయ్యాడు పునీత్‌. ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. అశ్విని ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓకే చెప్పేసింది. కానీ, వారి వివాహానికి అశ్విని పేరెంట్స్ మొద‌ట ఒప్పుకోలేదు. ఆరు నెల‌ల పాటు వెయిట్ చేయించి, అప్పుడు స‌రేన‌న్నారు. 

మ‌రోవైపు, త‌న ప్రేమ విష‌యం త‌ల్లితండ్రుల‌కు చెప్ప‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాడు పునీత్‌. ఒక‌రోజు తండ్రి రాజ్‌కుమార్ ద‌గ్గ‌ర త‌న‌కు వీరాభిమాని అయిన ఒక‌మ్మాయి ఉంద‌ని చెప్పాడు. కొడుకు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడో రాజ్‌కుమార్ వెంట‌నే గ్ర‌హించేశారు. "ఈ విష‌యం మీ అమ్మ‌తో చెప్పరా" అని ఆయ‌న చెప్పారు. అమ్మ పార్వ‌త‌మ్మ ఆశీర్వాదాలు కూడా పునీత్‌కు ల‌భించాయి.

పెళ్ల‌య్యాక జాయింట్ ఫ్యామిలీలో భాగంగా అంద‌రితో క‌లిసుండాల‌నే విష‌యం అశ్వినిని మొద‌ట్లో ఇబ్బంది పెట్టింది. కానీ చాలా త్వ‌ర‌గానే రాజ్‌కుమార్ కుటుంబం పాటించే విలువ‌ల‌ను అర్థం చేసుకొని, ఆ కుటుంబంలో మ‌న‌స్ఫూర్తిగా భాగ‌మైంది. ప్ర‌తి వీకెండ్ తాను స్వీట్స్ చేస్తాన‌ని, వాటిని త‌న మామ‌య్య రాజ్‌కుమార్ బాగా ఇష్ట‌ప‌డేవార‌ని ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది అశ్విని.

ఆమె సినిమాలు ఎప్పుడో కానీ చూసేది కాదు. అయితే చూస్తే మాత్రం, ఆ సినిమాలో త‌న‌కు న‌చ్చిన విష‌యాలు, న‌చ్చ‌ని విష‌యాల‌ను నిర్మొహ‌మాటంగా చెప్పేసేది. అశ్విని త‌న బెస్ట్ క్రిటిక్స్‌లో ఒక‌ర‌ని ఒక‌సారి పునీత్ వెల్ల‌డించాడు.

కొన్నేళ్ల క్రితం "పీఆర్‌కే" అనే బ్రాండ్‌ను నెల‌కొల్పాడు పునీత్‌. దానికి సంబంధించిన మెయిన్ డెసిష‌న్ మేక‌ర్స్‌లో అశ్విని ఒక‌రు. పునీత్‌-అశ్విని దంప‌తులకు ఇద్ద‌రు కుమార్తెలు.. ధ్రుతి, వందిత‌.

ప్ర‌తిష్ఠాత్మ‌క రాజ్‌కుమార్ కుటుంబంలో ఎంతో చ‌క్క‌గా ఇమిడిపోయిన ప‌ర్ఫెక్ట్ కోడ‌లు అశ్విని. భ‌ర్త పునీత్ త‌ర‌హాలోనే ఆమె కూడా స‌హృద‌యురాలిగా, విన‌య‌శీలిగా అశ్విని పేరు తెచ్చుకుంది.

ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా సాగిపోతున్న ఆ జంట‌ను చూసి విధికి క‌న్ను కుట్టింది. అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో పునీత్ క‌న్నుమూశాడు. త‌న నిజ‌జీవిత హీరో మృతితో అశ్విని గుండెలు ప‌గిలాయి.