Read more!

English | Telugu

ఉత్తమనటి అవార్డు విషయంలో సావిత్రి, భానుమతి మధ్య తలెత్తిన వివాదం!

సినిమా రంగంలో అవార్డుల విషయంలో ఒక్కోసారి వివాదాలు ఏర్పడుతుంటాయి. ఆమధ్య కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అవార్డులను ఎనౌన్స్‌ చేసినపుడు వివిధ రాష్ట్రాల్లోని హీరోల అభిమానులు, హీరోల సన్నిహితులు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, అవార్డులు రాని కొన్ని భాషల నటులు టాలీవుడ్‌ హీరోలను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేసిన విషయం కూడా మనకు తెలుసు. అంతేకాదు, ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో కూడా టాలీవుడ్‌లో కొన్ని భిన్నాభిప్రాయలు వెలుగు చూశాయి. 

అవార్డుల విషయంలో వివాదాలు ఏర్పడడం కొత్తేమీ కాదు. దానికి పాతతరం నటీనటులు కూడా అతీతులు కారు. 1950 దశకంలో ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరుతో మద్రాసులో ఓ సంఘం ఉండేది. ఆ సంఘం ప్రతి ఏటా సినిమా రంగంలోని వారికి అవార్డులు అందించేది. ఒక సంవత్సరం అవార్డులు ప్రకటించిన తర్వాత ఉత్తమ నటి అవార్డు విషయంలో వివాదం తలెత్తింది. 

1953లో సెన్సార్‌ అయిన తెలుగు, తమిళ భాషా చిత్రాలను పోటీకి పంపారు. అందులో ‘దేవదాసు’, ‘చండీరాణి’ చిత్రాలు కూడా వున్నాయి. ఆ సినిమాలన్నీ చూసారు న్యాయ నిర్ణేతలు.  ఆ తర్వాత తెలుగులో ఉత్తమ నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు(దేవదాసు), ఉత్తమ నటిగా భానుమతి(చండీరాణి) ఎంపికైనట్టు ప్రకటించారు. అలాగే తమిళ్‌లో సావిత్రిని ఉత్తమనటిగా సావిత్రి(దేవదాసు)ని ఎంపిక చేశారు. దీంతో అందరూ షాక్‌ అయ్యారు. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మాణం జరుపుకున్నాయి. 

రెండు భాషల్లో ఒకే సినిమా నిర్మాణం జరుపుకున్నప్పుడు తమిళ్‌లో మాత్రమే సావిత్రికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు తెలుగులో కూడా ఇవ్వాలిగా. ఇక భానుమతికి తెలుగులో మాత్రమే ఉత్తమనటి అవార్డు ఇవ్వడం ఏమిటి? తమిళ్‌లో కూడా ఇవ్వాలిగా. ఒకే అవార్డును ఇద్దరికి ఎలా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అలా అవార్డులను ఇద్దరికీ పంచారా? అంటూ పత్రికలు ఏకి పారేశాయి. వివిధ వార్తా పత్రికల్లో ఈ అవార్డులను ప్రస్తావిస్తూ వ్యాసాలు, కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఈ కథనాలకు అవార్డుల కమిటీ స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన అవార్డుల ప్రదానంలో వారు ప్రకటించిన విధంగానే అవార్డులను అందించారు. ఉత్తమనటిగా సావిత్రి అవార్డును అందుకున్నారు. ‘చండీరాణి’ చిత్రానికి ఉత్తమనటి అవార్డును అందుకోవడానికి భానుమతి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.