Read more!

English | Telugu

పోకిరి, బద్రి, చిరుత, ఆంధ్రావాలా.. వీటికి మొదట అనుకున్న టైటిల్స్‌ ఏమిటో తెలుసా?

పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్లు, డైలాగులు, కామెడీ ట్రాక్‌.. ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అన్నింటినీ మించి అంతవరకు ఎవరూ పెట్టని టైటిల్స్‌ పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తాడు పూరి. అయితే ఇప్పటివరకు వచ్చిన పూరి సినిమాలకు మొదట వేరే టైటిల్స్‌ అనుకున్నారని, ఎన్నో డిస్కషన్స్‌ తర్వాత ఫైనల్‌గా బయటికి వచ్చిన టైటిల్స్‌ అవి అన్న విషయం చాలా మందికి తెలీదు. అలా అతని సినిమాలకు ముందు అనుకున్న టైటిల్స్‌ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

మహేష్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ రూపొందించిన ‘పోకిరి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన సినిమాగా ‘పోకిరి’ నిలిచింది. సినిమాకి ఆ రేంజ్‌ రావడానికి టైటిల్‌ కూడా ఒక కారణం అయింది. అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్‌ ‘ఉత్తమ్‌సింగ్‌’. 

పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయే సినిమా ‘బద్రి’. రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు ‘చెలి’. పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోకి ఆ టైటిల్‌ మరీ క్లాస్‌ అయిపోతుందని భావించిన పూరి దాన్ని ‘బద్రి’గా మార్చారు. 

రామ్‌చరణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన సినిమా ‘చిరుత’. ఈ సినిమాకి మొదట ‘కుర్రాడు’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. అంతేకాదు, ‘లో క్లాస్‌ ఏరియా’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. ఈ టైటిల్‌ చిరంజీవి తనయుడికి సరిపోయేలా లేదని భావించి ‘చిరుత’నయుడు అని అర్థం వచ్చేలా ‘చిరుత’ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. 

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నిరాశ పరచింది. ఈ సినిమాకి మొదట ‘కబ్జా’ అనే టైటిల్‌ అనుకున్నారు. చాలా రోజుల వరకు అదే టైటిల్‌తో కంటిన్యూ అయ్యారు. చివరికి ‘ఆంధ్రావాలా’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని మార్చారు. 

పూరి జగన్నాథ్‌ ఎక్కువ సినిమాలు చేసింది రవితేజతోనే. ఇడియట్‌, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, నేనింతే, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి.. ఇలా అన్నీ విభిన్నమైన టైటిల్స్‌తోనే వచ్చాయి. అయితే ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చిత్రానికి మొదట ‘జీవితం’ అనే టైటిల్‌ అనుకున్నారు. ఈ టైటిల్‌ ఎంతో నార్మల్‌ వుందని, టైటిల్‌లోనే నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ కనిపిస్తున్నాయని భావించిన పూరి దాన్ని ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’గా మార్చారు.