Read more!

English | Telugu

రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన నటి!

ఆమె పేరు వసుంధరాదేవి..అందానికి అందం.. అభినయానికి అభినయం..1965 నుంచి 1980 వరకు దాదాపు 15 సంవత్సరాలు తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి. ఒక దశలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ వైభవం ఎంతో కాలం నిలవదని, విధి వారిని దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేస్తుందనే విషయం కొందరు నటీనటుల జీవితాలను పరిశీలిస్తే తెలుస్తుంది. అలాంటి హీరోయిన్లలో కాంచన కూడా ఒకరు. ఆమె అసలు పేరు వసుంధరాదేవి. 1939 ఆగస్ట్‌ 16న ప్రకాశం జిల్లా కరవదిలో జన్మించారు. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమె కుటుంబమంతా మద్రాస్‌లో స్థిరపడ్డారు. వారిది ఎంతో సంపన్న కుటుంబం. చిన్నతనం నుంచీ ఐశ్వర్యంలో పెరిగారు. ఆరోజుల్లోనే కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు వారికి ఉండేవి. కాంచనకు 16 సంవత్సరాలు వచ్చే వరకు సమాజంలో అప్పు అనేది ఒకటి ఉంటుందని, మన అవసరానికి ఎవరి దగ్గరైనా తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించాలనే విషయం తెలీదంటేనే అర్థం చేసుకోవచ్చు వారు ఎంత ధనవంతులో. ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి అనే సామెత కాంచన కుటుంబం విషయంలో అక్షరాల నిజమైంది. వారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒక్కసారిగా పేదరికం వారిని చుట్టుముట్టింది. దాంతో తన చదువును ఇంటర్‌తో ఆపేశారు కాంచన. 

కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం సంపాదించుకున్నారు. అప్పటివరకు మోడ్రన్‌ డ్రెస్సుల్లో కనిపించిన ఎయిర్‌ హోస్టెస్‌లు సంప్రదాయమైన చీరలు కట్టుకోవాలని ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొత్త రూల్‌ పాస్‌ చేసింది. చీరలో ఎంతో అందంగా కనిపించే కాంచన ఎయిర్‌ హోస్టెస్‌ అనే జాబ్‌కి కొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఫ్లైట్‌లో ప్రయాణించిన కొందరు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కాంచనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. కానీ, ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఫ్లైట్‌లోనే కాంచనను చూసి తమిళ దర్శకుడు శ్రీధర్‌ ఆమెను ఒప్పించి ‘ప్రేమించి చూడు’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అప్పుడే ఆమె పేరును కాంచనగా మార్చారు దర్శకుడు శ్రీధర్‌. అంతకుముందు బాలనటిగా చాలా సినిమాల్లో నటించిన కాంచన హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా అదే. అయితే ‘వీరాభిమన్యు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు కాంచన. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నించారు. కానీ, ఆమె మాత్రం పెళ్లికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం 84 ఏళ్ళ వయసులో ఉన్న కాంచన ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నారు. 1980 వరకు ఆమె కెరీర్‌ ఎంతో ఉజ్వలంగా ఉంది. ఆ తర్వాత ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. కెరీర్‌ పరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి తన తండ్రి నుంచి సంక్రమించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానం, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చేసి దైవసన్నిధిలో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కాంచన. ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలను ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు కాంచన. 

‘నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం అడేది. నాన్న అప్పుల పాలవ్వడంతో ఆస్తి కరిగిపోయింది. ఆ సమయంలోనే ఎయిర్‌హోస్టెస్‌గా జాయిన్‌ అయ్యాను. నెలకు రూ.600 జీతం ఇచ్చేవారు. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎన్నో సినిమాల్లో నటించాను. దాదాపు 15 సంవత్సరాలు సినిమాల కోసమే పరుగులు తీశాను. చివరికి ఒంటరిదాన్ని అయిపోయాను. నా తల్లిదండ్రులు.. మా పిన్ని కొడుకుని బాగా నమ్మారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు వాడు. ఇప్పటికే నేను సంపాదించిన దాంట్లో చాలా వరకు వాడేసుకున్నాడు. ఇవన్నీ భరించలేక 1996లో ఆ ఇంటి నుంచి వచ్చేశాను. మా అమ్మ, నాన్న కూడా నాకు వ్యతిరేకంగా మారిపోయారు. వాడిని నమ్మి నన్ను మోసం చేశారు. ఎన్నో ఏళ్ళుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరనే బాధ నాకు లేదు. ఎందుకంటే నాకు భగవంతుడు తోడున్నాడు. 

ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దవారిని, ఎన్నో సినిమాల్లో నటించిన ఒక ఆర్టిస్టుని గౌరవించడం లేదు. పైగా అవమానిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్‌ చేయమని అడిగేందుకు రాజమౌళి వచ్చారు. రెండు రోజుల క్యారెక్టర్‌ చెయ్యాలని చెప్పారు. నేను దానికి రూ.5 లక్షలు అడిగాను. అయితే అంత ఇచ్చుకోలేమని, వేలల్లో ఇవ్వగలమని అన్నారు. నాకు చాలా బాధ కలిగింది. సినిమాలో క్యారెక్టర్‌ ఇస్తానని చెప్పి నన్ను అలా అవమానించడం సరికాదు అనిపించింది. నా ఆస్తినంతా టెంపుల్‌కే ఇచ్చేశాను. నాకు డబ్బుతో పనేముంది. ఎన్నో సేవలు చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బును కూడా సేవ కోసమే వినియోగిస్తాను. రాజమౌళి లాంటి వారికి రూ.5 లక్షలు ఒక లెక్కా. పైగా నన్ను అవమానించినట్టు కూడా మాట్లాడారు. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చాలా మంది చెప్పుకుంటున్నారు. కానీ, అలాంటిది ఏమీ లేదు. ఆర్థికంగా బాగానే ఉన్నాను. దైవసన్నిధిలో సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాను’ అన్నారు కాంచన.