English | Telugu

ఏ హీరోకీ సాధ్యం కాని ఆ పాత్రను పోషించి చరిత్ర సృష్టించిన ఎన్‌.టి.ఆర్‌.!

ఏ నటుడికైనా తను ఎన్ని రకాల క్యారెక్టర్స్‌ చేసినా ఇంకా ఏదో చెయ్యాలి, అంతకుమించిన పాత్ర పోషించాలి అనే తపన ఉంటుంది. అంతేకాదు, తనకంటూ ఓ డ్రీమ్‌ క్యారెక్టర్‌ కూడా ఉంటుంది. దాన్ని పోషించి ప్రేక్షకుల్ని మెప్పిస్తేనే అతనిలోని కళాకారుడు సంతృప్తి చెందుతాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. కొన్ని దశాబ్దాలపాటు సినిమాలు చేసినా తన మనసుకి దగ్గరగా ఉంటూ తను ఎంతో ప్రేమించే క్యారెక్టర్‌ చేసే అవకాశం రాదు. అయితే మహానటుడు ఎన్‌.టి.రామారావులాంటి వారు అలాంటి పాత్రలు చేసేందుకు ఎంత రిస్క్‌ తీసుకోవడానికైనా సిద్ధపడతారు. ఎంతమంది విమర్శించినా దాన్ని మనసులో పెట్టుకోకుండా తను చేసే పాత్రపైనే మనసు పెడతారు. అలాంటి ఓ క్యారెక్టర్‌పై ఎన్టీఆర్‌ మనసు పడ్డారు. ఆ క్యారెక్టర్‌ చెయ్యడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. ఇంతకీ ఎన్‌.టి.రామారావు అంత ఛాలెంజింగ్‌గా తీసుకున్న క్యారెక్టర్‌ ఏదో తెలుసా? అదే రావణాసురుడి పాత్ర. 

1958లో కె.శంకర్‌ దర్శకత్వంలో ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ‘భూకైలాస్‌’ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌. రావణాసురుడిగా నటించారు. అయితే ఈ సినిమాలో రాముడి ప్రస్తావన ఉండదు. కేవలం రావణాసురుడి చుట్టూనే కథ తిరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రావణాసుర జీవిత క్రమం మాత్రమే ఉంటుంది.  పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. లంకాధిపతి రావణాసురుడు గొప్ప శివ భక్తుడు. మహాశివుడి ఆత్మలింగాన్ని సాధించి, అమరత్వం పొందాలని రావణాసురుడికి కోరిక కలుగుతుంది. ఆ నేపథ్యంలో ‘భూకైలాస్‌’ చిత్రకథ కొనసాగుతుంది. ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత తాను రాముడిగా, ఎస్‌.వి.రంగారావు రావణాసురుడిగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కి వచ్చింది. కథ సిద్ధం చేసుకొని ఇక సినిమా మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్‌ సన్నిహితుడు కృష్ణచౌదరి.. రావణాసురుడిలోని విశిష్టతను తెలియజేసే ఓ పుస్తకాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత ఎన్టీఆర్‌కి రావణాసురుడి పాత్రపై మక్కువ పెరిగింది. తను ఆ సినిమాలో రావణ పాత్రను పోషించాలని నిర్ణయించుకున్నారు. కానీ, దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం ‘కృష్ణుడిగా చూపించిన నిన్ను రావణాసురుడిగా చూడలేను. పైగా రావణాసురుడు వంటి రాక్షసుడ్ని ధీరోదాత్తుడిగా చూపించడం నా వల్ల అయ్యేది కాదు’ అన్నారు. ఈ విషయంలో తాను అనుకున్న దానికే కట్టుబడిన కె.వి.రెడ్డి మర్యాద పూర్వకంగానే సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక అప్పుడు ఎన్టీఆరే దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. కానీ, తెరపై దర్శకుడిగా తన పేరు వేసుకోకపోవడం విశేషం. 

నటీనటుల ఎంపిక మొదలైంది. రాముడిగా హరనాథ్‌, సీతగా గీతాంజలి, లక్ష్మణుడిగా శోభన్‌బాబు, నారదుడిగా కాంతారావు, రావణాసురుడి భార్యగా బి.సరోజాదేవి.. మిగతా పాత్రల కోసం  ప్రముఖ నటీనటులు ఎంపికయ్యారు. సినిమా పేరు ‘సీతారామ కళ్యాణం’ అయినప్పటికీ కథ మొత్తం రావణాసురుడి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రావణాసురుడి పాత్ర చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘భూకైలాస్‌’లో రావణుడిగా నటించినప్పటికీ అందులో రాముడి పాత్ర ఉండదు. ఈ సినిమాలో రాముడి పాత్ర ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ రావణ పాత్ర పోషించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ పాత్రకు జీవం పోసి తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించారు ఎన్టీఆర్‌. అంతకుముందు ఎన్టీఆర్‌ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ రెహమాన్‌ అందుబాటులో లేకపోవడంతో రవికాంత్‌ నగాయిచ్‌ అనే కొత్త కుర్రాడికి ఆ బాధ్యతను అప్పగించారు. ఎన్నో సన్నివేశాలను తన ట్రిక్‌ ఫోటోగ్రఫీతో అద్భుతంగా తీశారు రవికాంత్‌. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పది తలలు కనిపించడం కోసం ఎన్టీఆర్‌, రవికాంత్‌ ఎంతో శ్రమించారు. ఆ సీన్‌ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం చేతులు చాచి పైకి చూస్తూ దాదాపు పది గంటలు అలాగే నిలబడ్డారు ఎన్టీఆర్‌. ఆ సీన్‌ పూర్తయిన తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత మరో సన్నివేశంలో శివానుగ్రహం కోసం కడుపులోని పేగులు తీసి వీణానాదం చేస్తూ తన మొహంలో పలికించిన భావాలు చూసి సినీ పరిశ్రమలోని ప్రముఖులు షాక్‌ అయ్యారు. రౌద్రం, క్రోదం, ఆవేదన కలగలిసిన ఆ మొహాన్ని చూసి అక్కినేని దిగ్భ్రాంతికి గురయ్యారట. ఇంట్లో అద్దం ముందు కూర్చొని ఆ హావభావాలను పలికించాలని ప్రయత్నించారట అక్కినేని. కానీ, తన వల్ల కాలేదు. అది ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యం అని అక్కినేని స్వయంగా చెప్పడం విశేషం. 

1961 జనవరి 6న ‘సీతారామకళ్యాణం’ విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రతినాయకుడైన రావణాసురుడిలోని విశిష్టత, శివభక్తుడిగా అతనిలోని ప్రత్యేతలను చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చూసిన సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ను రావణుడిగా చూడలేనన్న కె.వి.రెడ్డి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజల మనసుల్లో రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు అనే భావన ఉన్న రోజుల్లో అతని పాత్రనే ప్రధానంగా చేసుకొని రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మరో విశేషం ఏమిటంటే ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా నిలిచిన ‘లవకుశ’ చిత్రం ‘సీతారామకళ్యాణం’ విడుదలైన రెండు సంవత్సరాలకు రిలీజ్‌ అయింది. ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తను ఏ పాత్ర చేసినా దానికి జీవం పోస్తానని ‘లవకుశ’, ‘సీతారామకళ్యాణం’ చిత్రాలతో నిరూపించారు ఎన్టీఆర్‌.