English | Telugu

"వాన కాదు వాన కాదు వరదరాజా".. ఎన్టీఆర్ 'భాగ్యచక్రము'కి 55 ఏళ్ళు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే నిర్దేశకుల్లో దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి ఒకరు. వీరిద్దరి కలకయికలో పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో 'భాగ్యచక్రము' ఒకటి. జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా బి. సరోజాదేవి నటించగా రాజనాల, పద్మనాభం, ముక్కామల, లింగమూర్తి, పీజే శర్మ, పేకేటి శివరామ్, సురభి బాలసరస్వతి, గీతాంజలి, రుష్యేంద్రమణి, జ్యోతిలక్ష్మి, కనకం, ప్రభావతి, బేబి మల్లిక ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పింగళి నాగేంద్రరావు మాటలు, పాటలు సమకూర్చారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేశారు.
పెండ్యాల నాగేశ్వరరావు సంగీతమందించిన 'భాగ్యచక్రము'లో పాటలన్నీ ఆకట్టుకున్నాయి. మరీముఖ్యంగా.. "వాన కాదు వాన కాదు వరదరాజా" విశేషాదరణ పొందింది. అలాగే "ఆశ నిరాశను", "నీవు లేక నిముసమైన", "కుండ కాదు కుండ కాదు చినదానా" అంటూ మొదలయ్యే పాటలు కూడా అలరించాయి. జయంతి పిక్చర్స్ పతాకంపై పి.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1968 సెప్టెంబర్ 13న జనం ముందు నిలిచిన 'భాగ్యచక్రము'.. బుధవారంతో 55 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.