Read more!

English | Telugu

రీమేక్ ట్రెండ్‌కి బాలీవుడ్ ఎండ్‌కార్డు వేస్తుందా?

సినిమా ఇండ‌స్ట్రీని నడిపే ఏకైక మంత్రం పేరు స‌క్సెస్‌. ఆ మంత్రం ప‌నిచేసిన‌న్ని రోజులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు పోగేసుకుంటారు. అదే మంత్రానికి కాసులు రాల‌లేద‌నుకోండి ట్రెండ్ మార్చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్‌కి కాసులు కురిపించ‌ని ఓ ట్రెండ్ ఫేడ‌వుట్ అయిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇంత‌కీ ఏమిటా ట్రెండ్ అనుకుంటున్నారా?  రీమేక్స్ ట్రెండ్‌.

సౌత్‌లోనూ, ఇత‌ర భాష‌ల్లోనూ స‌క్సెస్ అయిన సినిమాల‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌డం మామూలు విష‌య‌మే. మొన్న మొన్న‌టిదాకా స‌క్సెస్‌ఫుల్ బాట‌లో న‌డిచిన ఆ సినిమాలు, ఇప్పుడు ఫెయిల్యూర్స్ ని చ‌విచూస్తున్నాయి. అందుకే రీమేక్స్ చేసి టైమ్ వేస్టు చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హాలు అందుతున్నాయి బాలీవుడ్ మేక‌ర్స్ కి. లాస్ట్ ఇయ‌ర్ విడుద‌లైన జెర్సీ, మొన్న‌టికి మొన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన షెహ‌జాదా అనుకున్న స్థాయిలో జ‌నాల‌కు రీచ్ కాలేదు. వాటికి తోడు సెల్ఫీ కూడా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. దృశ్యం2 త‌ప్ప పెద్ద‌గా కాసులు పోగేసుకున్న చిత్రాలైతే లేవు. లాల్ సింగ్ చ‌డ్డా, దుబారా, హిట్‌:  దిఫ‌స్ట్ కేస్‌, త‌డ‌ప్ కూడా ఈ కోవ‌లోకే వ‌చ్చాయి. 2022 బాలీవుడ్‌కి బ్యాడ్ ఇయ‌ర్ అనే అనుకున్న‌ప్ప‌టికీ, 2023లోనూ ఒరిజిన‌ల్ కంటెంట్‌కే అక్క‌డ కాసులు కురుస్తున్నాయి.

ప‌ఠాన్‌, తు జూటీ మే మ‌క్క‌ర్ సినిమాల‌కు ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. ఈ నెల 30న అజ‌య్ దేవ్‌గ‌ణ్ బోళా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రి ఈ సినిమాను జ‌నాలు ఎలా ఆద‌రిస్తారో చూడాలి. ఒక‌వేళ హిట్ అయితే, అజయ్ చేసిన మార్పుల‌ను మెచ్చి స‌క్సెస్ వ‌చ్చింద‌నుకోవాలి. ఫ్లాప్ అయితే, ఆల్రెడీ సినిమాను ఓటీటీలో స‌బ్ టైటిల్స్ తో చూసేశారు కాబ‌ట్టి, బ్యాడ్‌ల‌క్ అనుకోవాలి. ఇప్పుడు సెట్స్ మీదున్న ఆకాశం నీ హ‌ద్దురా, ల‌వ్ టుడే వంటి సినిమాల‌ను  మిన‌హాయిస్తే, భ‌విష్య‌త్తులో ఒక భాష‌లో హిట్ అయింది క‌దా అని రీమేక్ చేయ‌డం సుద్ధ దండ‌గే అని హిత‌వు ప‌లుకుతున్నారు ట్రేడ్ పండిట్స్. మ‌రి బాలీవుడ్ మేక‌ర్స్ దీని గురించి ఏమంటారో చూడాలి.