Read more!

English | Telugu

దుబాయ్‌కి బ‌య‌లురేరిన జాక్వ‌లిన్‌ను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆపేశారు.. ఎందుకో తెలుసా?

 

దుబాయ్‌కు పోవాల‌ని ఆదివారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫ్ల‌యిట్ ఎక్క‌డానికి వెళ్లిన బాలీవుడ్ తార జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్‌ను ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. ఒక షోలో పాల్గొన‌డానికి జాక్వ‌లిన్ దుబాయ్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ 'లుక్ ఔట్ స‌ర్క్యుల‌ర్' (LOC) జారీ చేసింది. దీంతో మ‌రికొద్ది సేప‌ట్లో విదేశీ ప్ర‌యాణం చేయాల్సిన ఆమెను దేశం విడిచిపెట్టి పోకుండా అధికారులు నిలిపేశారు. కార‌ణం.. ఆర్థిక నేర‌గాడు సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో ఆమెకు అనుబంధం ఉండ‌టం! ముంబై ఎయిర్‌పోర్టులో ఆపేసిన ఆమెను, ఈరోజు ఢిల్లీలో విచారించ‌నున్నారు. అందిన స‌మాచారం ప్ర‌కారం, మ‌నీ లాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తు పూర్త‌య్యేదాకా జాక్వ‌లిన్ దేశం విడిచిపెట్టి పోకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

Also read:  ఆర్థిక నేర‌గాడు సుఖేశ్ బుగ్గ‌పై జాక్వ‌లిన్ ముద్దు.. బ‌య‌ట‌కొచ్చిన మిర్ర‌ర్ సెల్ఫీ!

రూ. 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇటీవ‌ల సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌, మ‌రికొంత‌మందిపై ఈడీ ఒక చార్జిషీట్‌ను దాఖ‌లు చేసింది. ఆ చార్జిషీట్ ప్ర‌కారం ఒక బిజినెస్‌మ్యాన్ భార్య నుంచి మోసం ద్వారా సుఖేశ్ డ‌బ్బు వ‌సూలు చేశాడు. ఈ కేసులో అత‌డిని తీహార్ జైలుకు త‌ర‌లించారు. అదే స‌మ‌యంలో సుఖేశ్‌తో ఆర్థిక లావాదేవీలు జ‌రిపిందంటూ జాక్వ‌లిన్‌పై ఈడీ అభియోగం మోపింది. ఆమెకు సుఖేశ్ నుంచి కానుక‌లు కూడా అందాయ‌నేది ఈడీ ఆరోప‌ణ‌. జాక్వ‌లిన్ కాకుండా మ‌రో న‌టి నోరా ఫ‌తేహిని కూడా ఈడీ విచారించింది.

Also read:  క‌త్రినా-విక్కీ పెళ్లి కోసం రాజ‌స్థాన్‌లో బుక్క‌యిన 45 హోట‌ళ్లు!

'అలాదిన్' (2009) మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది శ్రీ‌లంక‌కు చెందిన జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్‌. సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రితీశ్ దేశ్‌ముఖ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. పుష్క‌ర కాలం నుంచీ బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తోన్న జాక్వ‌లిన్.. 'జుడ్వా 2', 'హౌస్‌ఫుల్ 2', 'బాఘీ 2', 'మిసెస్ సీరియ‌ల్ కిల్ల‌ర్' త‌దిత‌ర చిత్రాల్లో నాయిక‌గా న‌టించింది.

ప్ర‌స్తుతం ఆమె హిందీలో 'బ‌చ్చ‌న్ పాండే', 'అటాక్‌', 'స‌ర్క‌స్‌', 'రామ్ సేతు', తెలుగులో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు', క‌న్న‌డంలో 'విక్రాంత్ రోణ' సినిమాలు చేస్తోంది.