Read more!

English | Telugu

హిందీ 'క్రాక్' షూటింగ్ మొద‌లైంది

 

'స‌న‌క్‌', 'ఖుదా హాఫిజ్ 2' సినిమాల్లో త‌న స్టెల్లార్ యాక్ష‌న్ స్కిల్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న కండ‌ల‌వీరుడు విద్యుత్ జ‌మ్వాల్‌.. ఇప్పుడు వాటిని మించిన యాక్ష‌న్ సీక్వెన్స్ ఉండే 'క్రాక్: జీతేగా తో జీయేగా' అనే సినిమా చేస్తున్నాడు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ నేప‌థ్యంలో ఈ సినిమా త‌యార‌వుతోంది. ఇప్ప‌టిదాకా ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ నేప‌థ్యంలో దేశంలో ఏ భాష‌లోనూ సినిమా రాలేదు.  

'క్రాక్: జీతేగా తో జీయేగా' అనే టైటిల్‌ ఇందులోని స్పోర్ట్స్ ఎంత డేంజ‌ర్‌వో సూచిస్తోంది. 'జీతేగా తో జీయేగా' అంటే 'గెలిస్తేనే బ‌తుకుతాడు' అని. అంటే.. ఆ ఆట‌లో దిగాక బ‌త‌కాలంటే గెలిచి తీరాలనీ, ఓడిపోవ‌డ‌మంటే చావేన‌నీ అర్థం. సో.. సీట్ల మీద మునివేళ్లతో కూర్చొనేలా ఈ సినిమా ఉంటుంద‌ని ఊహించుకోవ‌చ్చు.

'క్రాక్‌'లో విద్యుత్ జ‌మ్వాల్‌కు స‌మాంత‌ర పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టిస్తుండ‌గా, హీరోయిన్‌గా జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ న‌టిస్తోంది. 'క‌మాండో 3' త‌ర్వాత డైరెక్ట‌ర్ ఆదిత్య ద‌త్‌తో మ‌రోసారి క‌లిసి ప‌నిచేస్తున్నాడు విద్యుత్‌. మిగ‌తా తారాగ‌ణం ఎవ‌ర‌నేది వెల్ల‌డించాల్సి ఉంది.

'క్రాక్' షూటింగ్ పోలండ్‌లో ప్రారంభ‌మైన‌ట్లు ఈరోజు ఉద‌యం లీడ్ యాక్ట‌ర్స్ ట్వీట్ చేశారు. ముంబై స్ల‌మ్స్ నుంచి వ‌చ్చిన ఓ యువ‌కుడు, అండ‌ర్‌గ్రౌండ్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ ప్ర‌పంచంలోకి ఎందుకు అడుగుపెట్టాల్సి వ‌చ్చింది, అక్క‌డ త‌న ఉనికిని ఎలా చాటుకున్నాడ‌నేది ఈ సినిమాలోని ప్ర‌ధానాంశం. 2023లో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ది.

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రెజెంట్ చేస్తోన్న 'క్రాక్‌'ను విద్యుత్ జ‌మ్వాల్ సొంత సంస్థ యాక్ష‌న్ హీరో ఫిలిమ్స్‌, ప‌ర‌గ్ సంఘ్వీకి చెందిన పీజ‌డ్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌చ్చి ఘ‌న విజ‌యం సాధించిన 'క్రాక్' మూవీకీ, ఈ మూవీకీ ఎలాంటి సంబంధం లేదు.